Begin typing your search above and press return to search.

మీ మాట బాగుంది కానీ.. అలాంటి మేధావులు దేశంలో ఉన్నారా సర్?

By:  Tupaki Desk   |   29 Aug 2021 8:28 AM GMT
మీ మాట బాగుంది కానీ.. అలాంటి మేధావులు దేశంలో ఉన్నారా  సర్?
X
తమ్ముడు తనవాడైనా ధర్మం మాత్రమే మాట్లాడాలన్న సామెతను తరచూ వింటూ పెరిగిన తెలుగు వారు.. ఇప్పుడా మాటను వింటే.. ఇలాంటి సామెతలు కూడా మనకున్నాయా? అన్న ప్రశ్నను సంధించే తరం మనకొచ్చేసింది. పుట్టిన నెలలకే మొబైల్ ఫోన్ ఇచ్చేయటం.. వాటికి వ్యసనపరులుగా మారుస్తున్నఈ తరం తల్లిదండ్రుల పుణ్యమా అని.. వారికి నీతికథలు.. నీతి బోధ లాంటివి తెలియకపోగా.. తెలుగు భాషకుతియ్యదనాన్ని.. కమ్మదనాన్ని చాటి చెప్పే ఎన్నో విషయాల్ని ఎవరూ చెప్పకుండానే ఇప్పటి తరం పెరిగిపోతున్నారు.

దీంతో.. ఎవరికి వారు తాము నమ్మిన విషయాన్ని.. తాము అభిమానించే వారి మాటల్ని మాత్రమే ఫాలో కావటం తప్పించి.. హంసలా పాలకు పాలు.. నీళ్లకు నీళ్లు విడదీసే విచక్షణను మిస్ అవుతున్నారు. దీని వల్ల సమాజానికి.. ఒక జాతికి జరిగే నష్టం ఏమిటన్న విషయాన్ని ఇటీవల కాలంలో చూస్తున్నాం. విషయం ఏదైనా కానీ.. చీలికలు పీలికలుకావటం.. ప్రతి విషయంలోనూ కులం.. ప్రాంతం.. మతం లాంటి అంశాలే కాదు.. మరిన్ని వికారాలు తరచూ తెర మీదకు వస్తూనే ఉన్నాయి.

ఏదైనా ఘటన చోటు చేసుకున్నంతనే.. తమకు తోచినట్లుగా.. తమ వారికి డ్యామేజ్ జరగని రీతిలో వార్తల్ని వంటకాలుగా మార్చేయటం ఒక ఎత్తు అయితే.. గతంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద డిబేట్ జరిగేది. ఇప్పుడు అందుకు భిన్నంగా తమకు నచ్చిన మాటలు ఎవరి నోట వచ్చినా.. లేదా తాము అభిమానించే ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వాటిని గుడ్డిగా ఫాలో కావటం.. సమర్థిస్తూ వాదనలు వినిపించటం అలవాటుగా మారింది. ఇలాంటివేళ.. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆమోఘం అన్న మాటను చెప్పారు కానీ.. అంత సీన్ ఇప్పుడు ప్రజలకు ఉందా? అన్న సందేహం కలిగేలా ఆయన మాటలు విన్నంతనే కలగటం ఖాయం. అంతేకాదు.. తమకు నచ్చని వార్తల విషయంలో ప్రజలు ఎలా వ్యవహరిస్తున్నారు? అన్న విషయాన్ని ఆయన సూటిగా స్పష్టంగా చెప్పేశారు. ఇంతకూ ఆయనేం చెప్పారన్నది ఆయన మాట్లలోనే చూస్తే..

- ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడితే దాన్ని బట్టబయలు చేసే బాధ్యత ప్రజాదరణ కలిగిన మేధావులదే. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం కల్పించే భ్రమలను.. క్రియేట్ చేసే తప్పుడు కథనాల్ని.. తప్పుడు వార్తల్ని నిలువరించాల్సిన అవసరం ఉంది.

- కోవిడ్ సంక్షోభ సమయంలో ఫేక్ వార్తలు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థే గుర్తించింది. ఇలాంటి తప్పుడు వార్తలకు ఫేస్ బుక్.. ట్విటర్లాంటి సోషల్ మీడియాలను బాద్యుల్ని చేయాలి.

- ప్రజలు కూడా తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఉండే పత్రికలనే చదువుతారు. భిన్నాభిప్రాయం టీవీలో వినిపిస్తే వెంటనే మ్యూట్ చేస్తారు. ఫేక్ న్యూస్ అడ్డుకోవాలంటే పరజా వ్యవస్థల్ని బలోపేతం చేయాలి.

- విద్యా సంస్థల్లో కూడా పిల్లలకు తప్పుడు ప్రచారానికి.. సత్యానికి తేడా తెలుసుకునే అవకాశం కల్పించాలి.