Begin typing your search above and press return to search.

రిజర్వేషన్లపై సుప్రీం కీలక విచారణ.. రాష్ట్రాల కోర్టులోనే బంతి!

By:  Tupaki Desk   |   16 March 2021 6:45 AM GMT
రిజర్వేషన్లపై సుప్రీం కీలక విచారణ.. రాష్ట్రాల కోర్టులోనే బంతి!
X
దేశంలో ముందెన్న‌డూ లేనంతగా రిజ‌ర్వేష‌న్ల‌పై చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలోనే రిజ‌ర్వేష‌న్ల పెంపుపై సుప్రీం కోర్టులో కీల‌క‌మైన విచార‌ణ సాగుతోంది. గ‌తంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్ర‌కారం.. ఏ రాష్ట్రంలోనూ రిజ‌ర్వేష‌న్లు 50 శాతం మించ‌కూడ‌దు. 1992లో ఇందిరాస‌హానీ కేసులో ఏకంగా 11 మంది స‌భ్యుల‌తో కూడిన సుప్రీం ధ‌ర్మాస‌నం ఈ తీర్పు ఇచ్చింది. దీన్నే మండ‌ల్ తీర్పు అంటారు.

అయితే.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల మ‌రాఠాల‌కు ప్ర‌త్యేకంగా రిజ‌ర్వేష‌న్లు కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది. దీంతో.. 50 శాతంలోపే ఉండాల‌న్న‌ నిబంధ‌న తొల‌గించాలంటూ ప‌లు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. వీటిపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం రాజ్యాంగ ధ‌ర్మాస‌నం.. రాష్ట్రాల‌కు కీల‌క ఆదేశాలు జారీచేసింది.

ఈ నెల 8న ఐదుగురు జ‌డ్జీల‌తో ఏర్పాటైన రాజ్యాంగ ధ‌ర్మాస‌నం.. ఈ అంశంపై ఈ సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. రిజర్వేష‌న్లు 50 శాతానికి మించాలా? వ‌ద్దా? అనేది స్ప‌ష్టం చేయాల‌ని రాష్ట్రాల‌ను కోరింది. రాష్ట్రాలు స‌మ‌ర్పించే అఫిడ‌విట్ ప్ర‌కారం.. రిజ‌ర్వేష‌న్లలో 50 శాతం నిబంధ‌న ఉండాలా? వ‌ద్దా? అనేది తేల‌నుంది.