Begin typing your search above and press return to search.

టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

By:  Tupaki Desk   |   5 Nov 2020 11:30 AM GMT
టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు
X
అమరావతి భూకుంభకోణంపై దాఖలైన పిటీషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు గురువారం తెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. వారితోపాటు భూకుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు కూడా నోటీసులు జారీ చేసింది. విచారణను సుప్రీం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం విచారణ ప్రారంభం కాగానే సుప్రీం ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరుఫున సుప్రీం సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. గతంలో ఇలాంటి కేసుల్లో తీర్పులను ఉదహరించారు.

అమరావతి భూకుంభకోణంపై స్టే ఇచ్చే అధికారం రాష్ట్ర హైకోర్టుకు లేదని దుష్యంత్ వాదించారు. ఏపీలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగిన అంశాల్లో మాత్రమే విచారణ జరుపుతున్నామని.. హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని.. సుప్రీం ఆదేశాలకు లోబడి ఉండాల్సిందేనని వెల్లడించారు. ఈ వాదనను బలపర్చే తీర్పులను ఉదహరించారు.

ఏపీ కేబినెట్ జూన్ లో అమరావతి కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయించిందని.. ఈ విచారణ పారదర్శకంగా సాగుతున్న వేళ దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని దుష్యంత్ సుప్రీం ధర్మసనానికి నివేదించారు. సిట్ దర్యాప్తులో జోక్యం చేసుకోవడం హైకోర్టుకు తగదని.. పారదర్శకంగా సాగుతున్న సిట్ దర్యాప్తును టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని దుష్యంత్ వాదించారు.

దీంతో సుప్రీం కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ టీడీపీ నేతలకు, సిట్ కు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగువారాల పాటు వాయిదా వేసింది.