Begin typing your search above and press return to search.

కృష్ణా ట్రైబ్యునల్‌ అంశం .. 4 రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

By:  Tupaki Desk   |   29 Nov 2021 10:36 AM GMT
కృష్ణా ట్రైబ్యునల్‌ అంశం .. 4 రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు
X
కృష్టా ట్రైబ్యునల్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై డిసెంబర్‌ 13న సుప్రీం కోర్టు విచారణ జరపబోతుంది. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌ తుది నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజిట్‌ లో ప్రచురించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రతి స్పందన కోసం కేంద్రం తరఫున సీనియర్‌ హాజరైన న్యాయవాది రెండు వారాల గడువు కోరారు.

ఈ మేరకు కోర్టు డిసెంబర్‌ 13న విచారణ కోసం జాబితా చేసింది. కృష్టా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలపై ఫిటిషన్లను జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణ చేపట్టనున్నది. ఈ సందర్భంగా వాదనల వివరాలు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రాలు 3 పేజీలకు మించకుండా వాదనల వివరాలు ఇవ్వాలని, విచారణకు 48 గంటలలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌ -1, 2... తెలంగాణ అవసరాలను పట్టించుకోలేదని, న్యాయమైన వాటాను రాబట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విఫలమైందని తెలంగాణ పేర్కొంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చేసిన కేటాయింపులపై సమస్య లేదంది. కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఇచ్చిన రెండు తీర్పులను వ్యతిరేకిస్తామని పేర్కొంది. ఎగువన ప్రవాహాన్ని ఆపడం. అక్కడి ప్రాజెక్టులు నిండి, వినియోగం జరిగాకే, దిగువకు వదులుతున్నారని తెలిపింది. కృష్ణా, తుంగభద్ర రెండు నదుల్లోనూ ఆ పరిస్థితి ఉందని పేర్కొంది.

ఫలితంగా నీటిలభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో తెలంగాణకు దైన్యస్థితి తప్పట్లేదని వివరించింది. ట్రైబ్యునల్‌ తీర్పు ను నోటిఫై చేయకపోవడం వల్ల, నీటి కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోలేకపోతున్నామని కర్ణాటక పేర్కొనడం సత్యదూరమందని పేర్కొంది. వారి వాదన సరైంది కానందున పిటిషన్‌ ను తిరస్కరించాలని తెలంగాణ కోరింది. తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలపై తన సమాధానాలను కర్ణాటక తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ నిరంతరం ప్రయత్నిస్తోందని పేర్కొంది.