Begin typing your search above and press return to search.

సుప్రీం సీరియస్.. రోగుల బెడ్ల పక్కన శవాల్ని ఉంచుతారా?

By:  Tupaki Desk   |   13 Jun 2020 5:00 AM GMT
సుప్రీం సీరియస్.. రోగుల బెడ్ల పక్కన శవాల్ని ఉంచుతారా?
X
దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. మాయదారి రోగం దేశ వ్యాప్తంగా విస్తరించిన వేళ.. పలు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. పలు ఆసుపత్రుల్లో మృతదేహాల నిర్వహణ భయానకంగా.. దారుణంగా ఉందని పేర్కొంది.

మహమ్మారితో మరణించిన వారిని రోగుల బెడ్ల పక్కనే ఉంచేయటాన్ని తప్పు పట్టింది. రోగుల్ని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారంటూ.. ఒక మృతదేహాన్ని చెత్తకుప్పలో కనిపించటాన్ని ప్రస్తావించింది. ఇలాంటివి చూస్తే.. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. మృతదేహాలకు కనీస గౌరవ మర్యాదలతో అంతిమ సంస్కారాలు జరగాలన్న సుప్రీంకోర్టు.. కేంద్రానికి.. మహారాష్ట్ర.. పశ్చిమ బెంగాల్.. తమిళనాడు రాష్ట్రాలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇటీవల కాలంలో మీడియాలో పెద్ద ఎత్తున వచ్చిన కథనాల నేపథ్యంలో మృతదేహాల ఖననం విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తున్న వైనంపై సీరియస్ అయ్యింది. తనకు తానుగా విచారణను చేపట్టింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను చేపట్టి.. మృతదేహాల నిర్వహణలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్ని పలు ఆసుపత్రులు.. స్థానిక అధికారులు పాటించటం లేదని సీరియస్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. చూస్తుంటే.. ఈ కేసులో కేంద్రానికి.. ఆయా రాష్ట్రాలకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉందన్న మాట న్యాయవాద వర్గాల నోట వినిపిస్తోంది.