Begin typing your search above and press return to search.

ఆ 1100 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీమ్ షాక్!

By:  Tupaki Desk   |   18 July 2022 9:30 AM GMT
ఆ 1100 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీమ్ షాక్!
X
సుప్రీంకోర్టులో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్కెదురు అయ్యింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ( ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి జమ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను మళ్లించరాదని స్ప‌ష్టం చేసింది. కరోనా నాలుగో వేవ్‌ వస్తే ఏం చేస్తారని సూటిగా ప్ర‌భుత్వాన్ని నిలదీసింది. నిధులు లేక‌పోతే ప‌రిస్థితి ఏమిట‌ని ప్ర‌శ్నించింది. భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి తెలుస‌ని అని నిల‌దీసింది. మళ్లించిన నిధులను తిరిగి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాకు జమ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

కాగా కరోనా నియంత్రణకు వినియోగించాల్సిన దాదాపు రూ.1,100 కోట్ల మేర ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం మళ్లించిందని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఎంఆర్‌ షా, న్యాయ‌మూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. నిధుల మళ్లింపుపై కాగ్‌ సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించింది. అయితే, ఈ నిధులు 2020 మార్చి ముందువని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దానికి స్పందించిన ధర్మాసనం.. నిధులు ఎప్పటివైనా ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల‌ను వేరే కార్య‌క్ర‌మాల‌కు మళ్లించరాద‌ని స్ప‌ష్టం చేసింది.

కోవిడ్ -19 బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీకి ఉద్దేశించిన డబ్బును సంక్షేమం కోసం వ్యక్తిగత డిపాజిట్ (పీడీ) ఖాతాల్లోకి మళ్లించడంపై న్యాయమూర్తులు ఎంఆర్ షా, బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. విపత్తు సహాయం కోసం ఉద్దేశించిన నిధులను పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా, ఇతర ప్రయోజనాల కోసం మళ్లించడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. వచ్చే రెండు వారాల్లోగా 1100 కోట్ల రూపాయలను ఎస్‌డీఆర్ఎఫ్ కు తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోవిడ్-19 లబ్ధిదారుల దరఖాస్తును స్వీకరించిన నాలుగు వారాల్లోగా వారి అన్ని క్లెయిమ్‌లను పరిష్కరించాలని కూడా ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు విస్ప‌ష్ట ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ మొత్తాన్ని ఇత‌ర ప‌థ‌కాల‌కు ఇప్పటికే బదిలీ చేసినట్లయితే.. రాష్ట్ర ప్రభుత్వం డబ్బును ఉపయోగించకుండా సుప్రీంకోర్టు బెంచ్ నిషేధం విధించింది.

కాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటాగా రూ. 324.15 కోట్లు, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద రూ. 570.91 కోట్లు కేంద్రం నుంచి పొందినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖలో పేర్కొంది.