Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ కంగ‌న‌కు సుప్రీమ్ షాక్‌

By:  Tupaki Desk   |   22 Jan 2022 7:36 AM GMT
ఫైర్ బ్రాండ్ కంగ‌న‌కు సుప్రీమ్ షాక్‌
X
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న‌కు సుప్రీం కోర్టు తాజాగా షాక్ ఇచ్చింది. బీ టౌన్ లో కంగ‌న వ‌రుస వివాదాల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే.

గ‌తంలో మ‌హా రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేనే టార్గెట్ చేసి ఆయ‌న‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. మ‌హా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, ప్ర‌భుత్వ యంత్రాంగంతో పాటు కీల‌క మంత్రుల్ని, ముఖ్య‌మంత్రి ని కూడా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించింది.

నీ అహంకారం నేల రాలుతుంద‌ని మ‌హా రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ను ఉద్దేశించిన కంగ‌న పోస్ట్ చేసిన వీడియో పెద్ద దుమారాన్ని రేపింది కూడా. ఇక రైతుల ఉద్య‌మంపై కూడా అవాకులు చ‌వాకులు పేలి అడ్డంగా సోష‌ల్ మీడియాలో బుక్కైంది.

అక్క‌డితో ఆగ‌క సామాజిక అంశాల‌తో పాటు దేశ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారిన అంశాల‌ని కూడా స‌మ‌ర్దిస్తూ ష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు వివాదాస్ప‌ద పోస్ట్ లు పెడుతూ అనునిత్యం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వ‌స్తోంది కంగ‌న‌.

దీంతో సోష‌ల్ మీడియాలో కంగ‌న ఆగ‌డాల‌కు అడ్డుకట్ట వేయాల‌ని, ఆమె కు త‌గిన బుద్ధి చెప్పాల‌ని కొంత మంది సుప్రీమ్ కోర్టుని ఆశ్ర‌యించారు. కంగ‌న పై ప్ర‌త్యేకంగా పిల్ వేశారు. అయితే దీనిపై సుప్రీమ్ కోర్టు స్పందించింది. కంగ‌న పోస్ట్ ల‌పై స్పందించ‌లేమ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

అంతే కాకుండా ఆమె పోస్ట్ ల‌ని అడ్డుకోలేమ‌ని తేల్చి చెప్పింది. సిక్కులు, ముంబై పోలీసుల‌పై కంగ‌న షేర్ చేసిన పోస్ట్ ల‌పై ఓ యువ‌కుడు సుప్రీం కోర్టుని ఆశ్ర‌యించారు.

అయితే దీనిపై ఎలాంటి విచార‌ణ చేయ‌లేమ‌ని సుప్రీమ్ షాకిచ్చింది. అంతే కాకుండా ఆమె పోస్ట్ ల‌ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, క్రిమిన‌ల్ చ‌ట్టాల ద్వారా ఇలాంటి స‌మ‌స్య‌ల‌ని ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించింది.

అంతే కాకుండా కంగ‌న వ్యాఖ్య‌ల‌పై దాఖ‌లైన ఎఫ్ఐ ఆర్ లన్నింటినీ క‌లిపి విచారించాల‌ని స‌ద‌రు పిటీష‌న‌ర్ అభ్య‌ర్థించినా అలా కోరే అవ‌కాశం నీకే లేద‌ని కోర్టు పేర్కొంది.

దీంతో సోష‌ల్ మీడియాలో కంగ‌న‌కు అడ్డుకట్ట వేయాల‌నుకున్న వారి ప్ర‌య‌త్నాలు నీరుగారి పోయాయి. అయితే ఈ సంద‌ర్భంగా కంగ‌న వ్యాఖ్య‌ల‌ని, సోష‌ల్ మీడియా పోస్ట్ ల‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోకండి అని స‌ర్వోన్న‌త న్యాయం స్థానం చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.