Begin typing your search above and press return to search.

రైతుల ఉద్యమంపై కేంద్రానికి సుప్రీం వార్నింగ్

By:  Tupaki Desk   |   16 Dec 2020 11:58 AM GMT
రైతుల ఉద్యమంపై కేంద్రానికి సుప్రీం వార్నింగ్
X
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హరియాణా రైతులు చేపట్టిన ఉద్యమానికి దేశవ్యాప్తంగా రైతుల మద్దతు తోడైన సంగతి తెలిసిందే. గత 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు రాజస్థాన్ తో పాలు పలు రాష్ట్రాల రైతులు సంఘీభావం తెలిపారు. దేశంలోని విపక్ష పార్టీలు, పలువురు మేధావులు, కళాకారులు రైతులకు మద్దతు తెలుపుతున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతుండగా....సవరణలు చేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో రహదారులపై నుంచి రైతులను ఖాళీ చేయించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఆ పిటిషన్లపై విచారణ జరిపిన దేశపు అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓపెన్ మైండ్‌తో రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరపకపోతే రైతుల నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

రైతుల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో, రైతు సంఘాల ప్రతినిధులతోఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రతిపాదించింది. కేంద్రం సత్వరమే స్పందించకుంటే రైతుల సమస్య త్వరలోనే జాతీయ సమస్యగా మారే అవకాశముందని సుప్రీం అభిప్రాయపడింది. రైతుల సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వం, సంబంధితులతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ల విచారణలో తమ వాదనలు వినిపించేందుకు రైతు సంఘాలకు సుప్రీం అనుమతిచ్చింది. ఈ పిటిషన్ల తదుపరి విచారణ డిసెంబరు 17కు సుప్రీం వాయిదా వేసింది. సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం, రైతు సంఘాల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.