Begin typing your search above and press return to search.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులపై సుప్రీంకోర్టుకు షాకింగ్‌ నివేదిక!

By:  Tupaki Desk   |   15 Nov 2022 6:30 AM GMT
ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులపై సుప్రీంకోర్టుకు షాకింగ్‌ నివేదిక!
X
ఇది ప్రజాప్రతినిధులకు షాకింగే. వివిధ క్రిమినల్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించి సుప్రీంకోర్టుకు కీలక నివేదిక అందింది.

ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి ప్రజాప్రతినిధులపై దాఖలైన పలు క్రిమినల్‌ కేసులు ఐదేళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా తాజాగా నివేదించడం సంచలనం సృష్టిస్తోంది.

ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులకు సంబంధించి ఐదేళ్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి కింది కోర్టుల్లో తొలుత వాటిని విచారించాలని హన్సారియా సిఫార్సు చేశారు. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించాకే కింద కోర్టులు ఇతర కేసులను తీసుకొనేలా ఉత్తర్వులు జారీ చేయాలని సిఫార్సు చేశారు.

ముందుగా సిట్టింగ్‌ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను చేపట్టాలని హన్సారియా సుప్రీంకోర్టును కోరారు. ప్రజాప్రతినిధులపై కేసులను త్వరగా విచారించాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు విజయ్‌ హన్సారియాను అమికస్‌ క్యూరీగా నియమించింది. దీంతో ఆయన తాజాగా న్యాయస్థానానికి కీలక సిఫార్సులతో 40 పేజీల నివేదికను సమర్పించారు. సీబీఐ, ఈడీ కేసుల విచారణ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటుచేయాలని తన నివేదికలో సిఫార్సు చేశారు.

ఇప్పటివరకు ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను తెలంగాణతోపాటు 9 హైకోర్టులు పంపలేదని ఆయన తెలిపారు. 16 హైకోర్టులు మాత్రమే వాటిని అందజేశాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని స్పెషల్‌ కోర్టులో ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా 92 కేసులు ఉన్నాయని తెలిపింది. అందులో 50 కేసులు 5 ఏళ్లకు పైబడినవేనని నివేదికలో తెలపడం గమనార్హం.

మొత్తం మీద ఎంపీలు/ఎమ్మెల్యేలపై 121 సీబీఐ కేసులు ఉన్నాయని విజయ్‌ హన్సారియా తన నివేదికలో వెల్లడించారు. వాటిలో 51 మంది ఎమ్మెల్యేలు, 112 మంది ఎంపీలు నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీటిలో 58 కేసుల్లో జీవితఖైదు పడటానికి వీలుందన్నారు. 45 కేసుల్లో ఇంకా అభియోగాలే నమోదు చేయలేదని వెల్లడించారు.

ఎంపీలకు వ్యతిరేకంగా 51 ఈడీ కేసులు, ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలపై 71 మనీలాండరింగ్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.


సుప్రీంకోర్టుకు విజయ్‌ హన్సారియా చేసిన సిఫార్సులు:

- ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారిస్తున్న కోర్టులు ముందుగా వాటిపైనే విచారణ చేయాలి. అవి పూర్తయ్యాకే వేరే కేసుల జోలికి వెళ్లాలి. సీఆర్‌పీసీ సెక్షన్‌-309 ప్రకారం రోజువారీగా ఈ కేసుల ట్రయల్‌ చేపట్టాలి. ఇందుకు సంబంధించిన పని విభజనను సంబంధిత హైకోర్టు లేదా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జీలు 2 వారాల్లో పూర్తిచేయాలి.

- అసాధారణ అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ కేసుల విచారణను వాయిదా వేయకూడదు. నిందితులు వాయిదా కోరినా అందుకు కారణాలను రికార్డు చేసుకోవాలి.

- కేసుల విచారణ వాయిదాలు పడకుండా ప్రాసిక్యూషన్, డిఫెన్స్‌ న్యాయవాదులు సహకారం అందించాలి.

- కేసుల విచారణ కోసం సంబంధిత జిల్లా సెషన్స్‌ జడ్జితో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రత్యేక కోర్టులో కనీసం ఇద్దరు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాలి. రాజకీయ ఒత్తిళ్లతో విచారణ వేగంగా జరగడానికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సహకరించకపోతే.. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోర్టు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలి.

- ఒకవేళ నిందితులే విచారణలో జాప్యానికి కారణమైతే వారి బెయిలు రద్దు చేయాలి.

- మరణశిక్ష లేదా ఏడేళ్లు, అంతకుమించి జైలుశిక్ష పడటానికి వీలున్న కేసులను ముందుగా విచారించాలి.

- ప్రస్తుతం పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

- కోర్టులు ఆదేశించిన రోజు నిందితులను హాజరుపరిచే బాధ్యతను సంబంధిత పోలీసుస్టేషన్‌ అధికారికి ఇవ్వాలి. నిందితులను తీసుకురాకపోతే కోర్టులు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేయాలి. నిందితులు, సాక్షులను కోర్టు ముందు హాజరుపరచడంలో విఫలమైతే కోర్టులు నివేదిక కోరాలి.

- వేగవంతంగా కేసులను పరిష్కరించేందుకు సాక్షుల విచారణ, నిందితుల హాజరుకు సాధ్యమైనంత వరకు కోర్టులు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి.

- ఇవే సిఫార్సులను ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ కేసులకూ అమలు చేయాలి. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలి.

- పెండింగ్‌లో ఉన్న ఈడీ, సీబీఐ కేసుల పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదంటే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీ ఉండాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.