Begin typing your search above and press return to search.

దిశ ఎన్‌ కౌంటర్‌ కేసును హైకోర్టులో తేల్చుకోండి: సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   20 May 2022 10:32 AM GMT
దిశ ఎన్‌ కౌంటర్‌ కేసును హైకోర్టులో తేల్చుకోండి: సుప్రీంకోర్టు
X
హైదరాబాద్‌ నగర శివారల్లో దిశను కిడ్నాప్‌ చేసి.. పాశవికంగా అత్యాచారం చేసి.. పెట్రోలు పోసి తగులబెట్టిన కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ అత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌ కేసును తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది.

అలాగే ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ విలాస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను బయటపెట్టొద్దని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. నివేదికను బయటపెట్టకపోతే ఎన్‌కౌంటర్‌ చేసిందో ఎవరో ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. ఈ నివేదికను దాచాల్సిన పనిలేదని నివేదిక కాపీలను పిటిషనర్లకు, ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను సాప్ట్‌ కాపీ రూపంలో హైకోర్టుకు పంపుతామంది.

కాగా కమిషన్‌ నివేదికను సీల్డ్‌ కవర్‌లోనే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను దాచాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొందరు తప్పులు చేసినట్టు వెల్లడైందని.. కాబట్టి ప్రభుత్వం దాన్ని పరిశీలించాలని తెలిపింది. కాబట్టి నివేదికలో ఏముందో తెలియాల్సిన అవసరం ఉందంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తీర్పు ఇచ్చారు.

కాగా సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను బయటపెట్టొద్దని తెలంగాణ ప్రభుత్వం, నివేదికను బయటపెట్టాలని మానవ హక్కుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. అలాగే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో సుప్రీం కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. కాగా ఈ విచారణకు నిందితుల ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర పోషించిన నాటి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్, ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌ హాజరయ్యారు.

2020 నవంబర్‌ 27న ఆస్పత్రికి వెళ్లి తిరిగొస్తున్న దిశను నలుగురు లారీ డ్రైవర్లు అపహరించి నగర శివార్లలో అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ ఘటన షాద్‌ నగర్‌ మండలం చటాన్‌పల్లిలో జరిగింది. అయితే దిశను తగులబెట్టిన చోటే డిసెంబర్‌ 7న నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు.

సీన్‌ రిక్రియేషన్‌లో భాగంగా నిందితులను ఘటనా స్థలికి తీసుకొచ్చినప్పుడు పోలీసులపై రాళ్లు రువ్వి నలుగురు పారిపోవడానికి ప్రయత్నించారని.. తుపాకులు లాక్కొని పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్‌ చేశామని నాడు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో కానీ లేదా దేనితోనైనా విచారణ జరిపించాలని కోరాయి. అంతేకాకుండా తమకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇప్పించాలని కేసు దాఖలు చేశాయి.