Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో సుప్రియ సూలే ఏం చేశారో చూశారా సారూ?

By:  Tupaki Desk   |   27 Nov 2019 10:51 AM GMT
అసెంబ్లీలో సుప్రియ సూలే ఏం చేశారో చూశారా సారూ?
X
మరికొద్ది రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ.. అనూహ్యంగా ప్రభుత్వ ఏర్పాటు చేసే పార్టీకి చెందిన ముఖ్యనేత ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎంత ఒళ్లు మండుతుంది? తమను వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన తమ దగ్గరి బంధువుపైన చర్యలు తీసుకుంటారా?పదవులేముంది అన్నా? బంధాలు చాలా అవసరమని సోదరి నోట మాట వస్తే?

ఇవన్నీ కూడా సర్లే అనుకోవచ్చు. కానీ.. తమకు అధికారం దక్కకుండా చేసేందుకు భారీ ఎత్తులు వేసి.. తమలో తమకే చీలికలు తెచ్చిన వ్యక్తి ఎదురు పడితే? తమను ముప్పతిప్పలు పెట్టిన ఫడ్నవీస్ లాంటి నేత అసెంబ్లీలో ఎదురుపడితే ఏం చేస్తారు? తెలుగు రాష్ట్రాల్లో అయితే వారి ముఖం చూసేందుకు సైతం ఇష్టపడరు.

అలా చేస్తే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ప్రత్యేకత ఏముంటుంది? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయాలకు భిన్నంగా వ్యవహరించి తండ్రికి తగ్గ తనయగా ప్రశంసల్ని అందుకుంటున్నారు సుప్రియా సూలే. ఈ రోజు జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తన మాట విన్నారా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెట్టి.. తమకు హ్యాండిచ్చిన సోదరుడ్ని మన్నించేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న వైనం చూసినోళ్లంతా పరమానందభరితులయ్యారు. దీనికి మించి.. తమకు చుక్కలు చూపించిన దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడితే.. సుప్రియా సూలే ఆయన్ను సైతం అంతే అభిమానంతో స్వాగతించిన తీరు ఇప్పుడు అందరి మన్ననలను చూరగొంటున్నారు.

తమ పార్టీని చీల్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసిన తర్వాత కూడా.. వారి పట్ల ప్రదర్శించిన ఆదరణ చూసినప్పుడు.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సుప్రియా సూలే లాంటోళ్ల అవసరం చాలా ఉందన్న భావన కలుగక మానదు. తన మాట వినకుండా సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత కటువుగా వ్యవహరిస్తున్నారో తెలిసిందే. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రిని చూసి అదే పనిగా అక్కుసును వెళ్లగక్కుతున్న చంద్రబాబు లాంటోళ్ల స్థానంలో సుప్రియా సూలే లాంటి నేతలు ఉంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరోలా ఉంటాయని కచ్ఛితంగా చెప్పక తప్పదు.