Begin typing your search above and press return to search.

వీడిన ఉత్కంఠ ..ఎమ్మెల్సీగా సురభి వాణీ దేవీ విజయం

By:  Tupaki Desk   |   20 March 2021 12:41 PM GMT
వీడిన ఉత్కంఠ ..ఎమ్మెల్సీగా  సురభి వాణీ దేవీ విజయం
X
గత మూడు రోజులుగా కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠతకి తెర పడింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించారు.. సుధీర్ఘంగా జరిగిన ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ - ఎలిమినేషన్ - ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తాజాగా ముగిసింది. సురభి వాణీదేవి రెండో ప్రాధాన్యత ఓట్లతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన ఈ నెల 17 నుంచి ఇప్పటివరకూ సురభి వాణిదేవే ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. చివరకు తన సమీప బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుపై ఆమె గెలుపొందారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణిదేవి. అయితే, చివరి వరకు ఫలితాలపై ఉత్కంఠ కొనసాగింది.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎలిమినేషన్‌, ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లు భారీగా టీఆర్ ఎస్ ‌కు రావడంతో వాణిదేవి విజయం సాధించారు. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు టీఆర్ ఎస్ అభ్యర్థి వాణిదేవి - బీజేపీ అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్ల మధ్య వ్యత్యాసం ఓ సారి తగ్గుతూ, మరోసారి పెరుగుతూ వచ్చినా చివరకు విజయం ఆమెనే వరించింది. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా - బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి. దీనిపై కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీఆర్ ఎస్ గెలుపుతో తెలంగాణ భవన్‌ లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ ఫలితం వెలువడ్డాక... మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక,జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎన్నికల పెద్ద బూస్టింగ్ అనడంలో సందేహం లేదు.