Begin typing your search above and press return to search.

ఆ వ‌జ్రాల వ్యాపారి బాట‌లో ఇంకో వ్యాపార‌వేత్త‌

By:  Tupaki Desk   |   6 Nov 2016 7:29 AM GMT
ఆ వ‌జ్రాల వ్యాపారి బాట‌లో ఇంకో వ్యాపార‌వేత్త‌
X
గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్‌ జీ ధోలాకియా వ్య‌వ‌హార శైలి ఎంత భిన్నంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఖరీదయిన బహుమతులు ఇవ్వడం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఆయన దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన 1200 కార్లు - 400 ప్లాట్లు తన ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌ లుగా ఇచ్చారు. అదే విధంగా సూరత్‌ కే చెందిన మరో వజ్రాల వ్యాపారి గోవింద్ ధోలాకియా కూడా అదే బాటలో నడుస్తూ ఆస‌క్తిక‌ర‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.

గోవింద్ ధోలాకియా తన కంపెనీలో పని చేసే 300 మంది ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌ గా 15 రోజులు వేతనంతో కూడిన సెలవు ఇవ్వడమే కాకుండా వారినందరినీ కుటుంబాలతో సహా ఉత్తరాఖండ్‌ కు విహార యాత్రకు తీసుకెళ్లారు. సూరత్ - ముంబయిలలో శ్రీ రామకృష్ణ ఎక్స్‌ పోర్ట్స్ పేరుతో ఆయనకు వజ్రాల ఎగుమతి వ్యాపారం ఉంది. దాదాపు 1200 మంది కోసం గోవింద్ ధోలాకియా 90 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక ప్రత్యేక ఏసీ రైలునే బుక్ చేశారు. అంతేకాదు వారితో పాటుగా ఆయన కూడా ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి ప్రయాణించారు. విహార యాత్రకోసం వచ్చిన వీరంతా కేవలం యాత్రకే పరిమితం కాకుండా సామాజిక సేవలోకూడా పాల్గొనడం మరో విశేషం. వీరంతా రుషీకేశ్‌ లోని రామ్ ఝూలా వద్దనుంచి వేద్ నికేతన్ ఆశ్రమ్ దాకా దాదాపు అరకిలోమీటర్ దారిని శుభ్రం చేయడం ద్వారా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచారని స్వర్గాశ్రమ్ నగర్ పంచాయతీ అధ్యక్షుడు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/