Begin typing your search above and press return to search.

మోడీ యాప్‌, ఆయ‌న అబద్దాలు సేమ్ టు సేమ్‌

By:  Tupaki Desk   |   25 Nov 2016 7:46 AM GMT
మోడీ యాప్‌, ఆయ‌న అబద్దాలు సేమ్ టు సేమ్‌
X
పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై విప‌క్షాల విమ‌ర్శల జోరు కొన‌సాగుతోంది. తాజాగా ప్ర‌ధాన‌మంత్రి నోట్ల‌పై దేశంలోని 93 శాతం ప్రజలు తనకు మద్దతునిస్తున్నారని, త‌న యాప్ ద్వారా ఇది తేలింద‌ని చెప్పటంపై క‌మ్యూనిస్టు పార్టీలు మండిప‌డ్డాయి. ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ 93 శాతం మాటలన్నీ పెద్ద జోకులని విమర్శించారు. మోడీ యాప్‌ కు - ఆయ‌న అబ‌ద్దాలకు 93 శాతం సంఖ్య స‌రిగ్గా స‌రిపోయింద‌ని సుర‌వరం విమ‌ర్శించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో 92 శాతం ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని, రిటైల్ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని మండిప‌డ్డారు.

ఉత్తరప్రదేశ్‌ లోని రెండు ప్రధాన పార్టీలు సమకూర్చుకున్న డబ్బును నాశనం చేసేందుకే పెద్దనోట్ల రద్దు పేరుతో దేశ ప్రజలను శిక్షించారని సుర‌వ‌రం ఆరోపించారు. దేశ పాల‌కుడిగా తీసుకున్న నిర్ణ‌యం గురించి వివ‌రించేందుకు పార్లమెంటుకు వచ్చే తీరిక - పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక ప్ర‌ధానికి లేదా? అని ప్రశ్నించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా...? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలక విషయాలపై ప్రధాని వివరణ ఇవ్వాలని పట్టుబట్టారని గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28న వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని, వాటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగదు స్థానంలో ప్లాస్టిక్‌ నోట్లు - డెబిట్‌ - క్రెడిట్‌ కార్డులను వాడుకోవాలంటూ కేంద్రం చెప్పటం శోచనీయమని సుర‌వ‌రం అన్నారు.

డిసెంబరు చివరి నాటికి పరిస్థితులన్నీ సర్దుకుంటాయంటూ మోడీ చెబుతున్నప్పటికీ...దేశంలో మామూలు స్థితి నెలకొనటానికి కనీసం 175 రోజులు పడుతుందంటూ బ్యాంకు యూనియన్లు - ప్రతినిధులు - ఉద్యోగులు చెబుతున్నారని గుర్తుచేశారు. జీడీపీ మున్ముందు 3.5 శాతానికి పడిపోయే ప్రమాదముందంటూ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పాత కరెన్సీని మరికొంత కాలం అంగీకరించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. డిసెంబరు చివరి నాటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే...నోట్ల రద్దుపై పునరాలోచన చేయాలని మోడీకి సూచించారు. గుజరాత్‌ సీఎంగా మోడీ ఉన్నప్పుడు సహారా కంపెనీ నుంచి రూ.40 కోట్లు, బిర్లా డెయిరీ నుంచి రూ.15 కోట్లను తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుర‌వ‌రం డిమాండ్‌ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/