Begin typing your search above and press return to search.

బాబుకు పొగ‌పెట్టిన టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   11 Jan 2016 6:35 AM GMT
బాబుకు పొగ‌పెట్టిన టీడీపీ ఎంపీ
X
తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట ఎంపీ- సీనియ‌ర్ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు మ‌రోమారు పార్టీని ఇరుకున ప‌డేసేలా వ్యాఖ్యానించారు. విశాఖ‌కు రైల్వేజోన్ ఎందుక‌ని కామెంట్లు చేసి వివాదం సృష్టించి నాలుగురోజులైన కాక‌ముందే మ‌రోమారు పార్టీ అధినేత చంద్ర‌బాబును ఇరుకున ప‌డేసే స్టేట్‌ మెంట్ ఇచ్చారు.

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి గుంటూరు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న‌తో పాటు సీపీఐ నేత‌ల‌ను రాయ‌పాటి త‌న ఇంటికి పిలుచుకున్న రాయ‌పాటి వారికి అల్పాహార విందు ఇచ్చారు. అనంతరం సురవరంతో కలిసి రాయపాటి విలేకర్లతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తమకు పెద్దగా విభేదాలు లేకున్నా వారి నుంచి అనుకున్నంతగా సహకారం అందటం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి నిధులివ్వడం లేదని, రాజధానికీ సొమ్ములు కేటాయించడం లేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ క్రమంలో మున్ముందు తాము వామపక్షాలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ మాదిరిగా వామపక్షాలకూ అన్ని గ్రామాల్లో మంచి యంత్రాంగం - క్యాడర్‌ ఉంటుందని, నాయకులు కొద్ది మంది ఉన్నా నెట్‌ వర్క్‌ ఉపయోగపడుతుందని కూడా రాయ‌పాటి అంచనలు వేసేశారు. గతంలోనూ తాము కాంగ్రెస్‌ లో ఉన్నప్పుడు వామపక్షాలతో కలసి పనిచేసిన అంశాన్ని గుర్తు చేశారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటుందా? అని ప్రశ్నించగా ' భవిష్యత్తు పరిణామాలపై త్వరలో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ఏం జరుగుతుందో చూస్తుండండి' అని బాబును ముగ్గులోకి లాగారు.

అయితే రాయపాటి వ్యాఖ్యలపై సురవరం సుధాకర్‌ రెడ్డి వ్యూహాత్మకంగా స్పందించారు. తాము చాలా కాలంగా మంచి మిత్రులం కాబట్టి పిలవగానే విందుకు వచ్చానని దీనికి రాజకీయ ప్రాధాన్యతేమీ లేదన్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉన్నంత కాలం తాము కలసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో వామపక్షాలతో కలిసి పనిచేసిన చంద్రబాబు 2014లో పొరపాటున బీజేపీ వైపు వెళ్లారని, కొన్ని అంశాలపై ఇతర పార్టీలతో మాదిరిగానే టీడీపీతోనూ కలసి పనిచేస్తామని చెప్పారు. పొత్తు గురించి ఇప్పుడే మాట్లాటడం అనవసరమని, ఎన్నికలపుడే దేశంలో మూడో ఫ్రంట్‌ గురించి అప్పుడే చర్చిస్తామని సురవరం కొట్టిపారేశారు.

రాజకీయ నేతలుగా నేతల మిత్రుత్వాన్ని ఆత్మీయ ఆతిథ్యాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ వ్యక్తిగత ఆహ్వానాల్లో ఇరుకున పెట్టేవిధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేనేదే స‌రికాద‌ని తెలుగుత‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.