Begin typing your search above and press return to search.

సిద్ధాంతాలు వదిలేసి ఏకమవుతారట

By:  Tupaki Desk   |   27 Dec 2015 10:51 AM GMT
సిద్ధాంతాలు వదిలేసి ఏకమవుతారట
X
కమ్యూనిస్టులు ఏకం కావాలని సీపీఐ నేతలు మళ్లీ పిలుపునిస్తున్నారు. దేశ ఆర్థిక అభివృద్ధి ఎజెండాను నిర్ణయించే శక్తిగా ఎదిగేందుకు విడిపోయిన కమ్యూనిస్టులు ఇప్పుడు మళ్లీ పునరేకీకృతం కావాలని, అప్పుడే రెండు కమ్యూనిస్టు పార్టీలకూ భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే ఇద్దరికీ భవిష్యత్తు ఉండదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆ పార్టీ ఇతర నేతలు 90వ వ్యవస్థాపక దినోత్సవంలో చెబుతున్నారు.

ఓట్లు - సీట్లు ధ్యేయంగా సిద్ధాంతాలను వదిలేసి.. పోరాటాలను వదిలేసి.. ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోయిన తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టులు ఏకం అయితే మాత్రం ఏం జరుగుతుంది? మిగిలిన రాజకీయ పార్టీలను బూర్జువా, పెట్టుబడిదారీ, అవకాశవాద పార్టీలని దుమ్మెత్తిపోసే కమ్యూనిస్టు పార్టీలు మరీ ముఖ్యంగా సీపీఐ అవకాశవాద రాజకీయ పార్టీగా మారింది. ఎక్కడ ఏ తాళం అవసరమైతే ఆ తాళం వేస్తోంది. ఉదాహరణకు, తెలంగాణ వ్యవహారాన్నే తీసుకుందాం. విశాలాంధ్ర అన్న భావనను తెరపైకి తీసుకొచ్చింది గతంలో సీపీఐనే. విశాలాంధ్ర అన్న పేరు పెట్టింది కూడా అదే. కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో తన నినాదానికి తానే నీళ్లు వదిలేసింది. తెలంగాణకు జై కొట్టింది. సీపీఎం తన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నా.. సీపీఐ దాని నుంచి పక్కకు జరిగింది. జాతీయ స్థాయిలో బీజేపీ, మోదీ వ్యతిరేకత అన్న ఒకే ఒక్క ఎజెండా తప్ప సీపీఐకి మరో ఎజెండా కనిపించడం లేదు.

సీపీఐ, సీపీఎం పార్టీలు ఏవైనా వాటి ప్రాథమిక లక్ష్యం పోరాటమే. ప్రజా సమస్యలపై పోరాటంతోనే అవి కార్యకర్తల బలాన్ని సంపాదించుకున్నాయి. అన్నో ఇన్నో సీట్లను సాధించుకున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తొలి రోజులను మినహాయిస్తే ఆ తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు సరైన పోరాటం ఒక్కటి కూడా చేయలేదు.

సిద్ధాంతాలను మర్చిపోయి.. పోరాట బాటను వదిలేసిన తర్వాత కమ్యూనిస్టులు ఏకమైనా.. కమ్యూనిస్టుల్లో ప్రధాన పార్టీలు కలిసినా ఒరిగేది ఏముంటుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.