Begin typing your search above and press return to search.

కామ్రేడ్ మాట నిజమైతే ఎంత బాగుండు..?

By:  Tupaki Desk   |   8 Jan 2016 4:40 AM GMT
కామ్రేడ్ మాట నిజమైతే ఎంత బాగుండు..?
X
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రోజురోజుకీ బ్రెంట్ ముడిచమురు ధరలు పడిపోతూ ఉన్నాయి. గడిచిన పదకొండేళ్ల కనిష్ఠానికి ధర దిగజారి పోయిన పరిస్థితి. బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర 33 అమెరికా డాలర్ల తక్కువకు పడిపోయాయి. ఇంత భారీగా ధరలు తగ్గినా మనం మాత్రం పెట్రోల్ బంక్ కు వెళితే.. లీటరు పెట్రోల్ కు రూ.66 ఖర్చు చేయాల్సిందే.

యూపీఏ హయాంలో బ్యారెల్ ముడి చమురు ధర 115 డాలర్ల ధర పలికినప్పుడు లీటరు పెట్రోల్ రూ.78 నుంచి రూ.80 మధ్యలో ఊగిసలాడిన పరిస్థితి. తాజాగా అది కాస్తా 33 డాలర్లకు పడిపోయినప్పుడు లీటరు పెట్రోల్ ధర ఎంత ఉండాలి? చాలా చిన్న లెక్కే కానీ.. దీనికి సమాధానం చెప్పే వారు ఉండరు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు.. అందుకు తగ్గట్లే భారం మోపేందుకు ప్రభుత్వాలు రెఢీ అయిపోతున్నప్పుడు.. ధరలు భారీగా పడిపోయినప్పుడు అదే విధంగా ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది.

కానీ.. అందుకు భిన్నంగా ధరలు తగ్గని దుస్థితి. ముడి చమురు ధర భారీగా పడినా.. లీటరు పెట్రోల్ ధరల్ని తగ్గించాలన్న డిమాండ్ ను ప్రధాన రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇక.. అధికారపక్షానికి ఈ విషయమే పట్టదు. ఇలాంటి పరిస్థితిపై కమ్యూనిస్టు అగ్రనేత.. సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుదాకర్ రెడ్డి తాజాగా ఒక డిమాండ్ ను వినిపించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గిన నేపథ్యంలో.. లీటరు పెట్రోల్ ధరను రూ.15 మేర తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కామ్రేడ్ మాటకు తగ్గట్లే ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటే.. ఎంత బాగుండో కదా..?