Begin typing your search above and press return to search.

వెంకయ్యనాయుడికి గాలి తీసేసిన కామ్రేడ్

By:  Tupaki Desk   |   1 March 2017 12:03 PM GMT
వెంకయ్యనాయుడికి గాలి తీసేసిన కామ్రేడ్
X
హుందా అయిన నేతగా.. ఆచితూచి మాట్లాడే నేతగా.. ఊరికే గాలి వ్యాఖ్యలు చేయకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడే సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఈ రోజు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి గాలి తీసేశారు. వెంకయ్య నిత్యం మోడీ భజన ఎందుకు చేస్తున్నారన్నది విశ్లేషించారు. వెంకయ్య ఏం ఆశించి మోడీకి తానా తందానా అంటున్నారో చెప్పుకొచ్చారు. అయితే.. వెంకయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన అనుకున్న పని మాత్రం కాదని సురవరం అన్నారు.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని సురవరం అన్నారు.. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని వెంకయ్య పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారని... కానీ, మోడీని ఎంత పొగిడినా వెంకయ్య రాష్ట్రపతి కాలేరని చెప్పారు.

ఏబీవీపీపైనా ఆయన మండిపడ్డారు. ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థినిపై ఏబీవీపీ చేసిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. మీడియాపై కూడా ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని తెలిపారు. ప్రతి యూనివర్శిటీలో కూడా ఏబీవీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేవలం ఏబీవీపీ వల్లే ఓ కార్గిల్ యుద్ధ వీరుడి కుమార్తె చదువు మానేసి, ఇంటికి వెళుతున్నట్టు ప్రకటించిందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన ప్రసంగాలు చాలా దారుణంగా ఉన్నాయని... ఆయన ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.