Begin typing your search above and press return to search.

డిసెంబరు 30 తర్వాత ఏటీఎంలో క్యాష్ తీసుకుంటే?

By:  Tupaki Desk   |   22 Dec 2016 5:31 AM GMT
డిసెంబరు 30 తర్వాత ఏటీఎంలో క్యాష్ తీసుకుంటే?
X
పెద్దనోట్ల రద్దుతో కరెన్సీకష్టాలు ఓ రేంజ్లో సామాన్యుడి వేంటాడి.. వేటాడుతున్నముచ్చట తెలిసిందే. అయితే.. ఈ కష్టాలన్నీ డిసెంబరు30తో తీరుతాయని చెబుతున్నారు. అదెలా అంటే.. ఏటీఎం నుంచి రోజుకు రూ.2500 విత్ డ్రా చేసుకునే పరిమితి డిసెంబరు30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునేందుకు డిసెంబరు 31 నుంచి ఎలాంటి పరిమితులు ఉండవని కచ్ఛితంగా చెబుతున్నారు.

అంటే.. కొత్త సంవత్సరం ముందు రోజు నుంచి ఏటీఎంల ముందు బారులు తీరాల్సిన అవసరం లేదా? అంటే.. లేదనే మాట వినిపిస్తోంది. హమ్మయ్య.. ఏటీఎం తిప్పలు తప్పినట్లేనన్నమాట అని హ్యాపీగా ఫీల్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే..అసలు పాయింట్ ఇక్కడే ఉందని చెబుతున్నారు. అదేమంటే.. డిసెంబరు30 తర్వాత నుంచి బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసే క్యాష్ మొదలు.. ఏటీఎంల నుంచి తీసుకునే నగదుపై ప్రభుత్వం కొత్తగా సర్ ఛార్జ్ వేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

కేంద్రప్రభుత్వంలోని ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు వెల్లడించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బ్యాంకు విత్ డ్రాల మీదా.. ఏటీఎంల వినియోగం మీదా సర్ ఛార్జ్ వేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకునే విషయంలో భారీ కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. అయితే.. ఎంత మొత్తాన్ని విత్ డ్రా చేస్తే కొత్త సర్ ఛార్జ్ పడుతుందన్న విషయాన్ని చూస్తే.. సామాన్య.. మధ్యతరగతి జీవులకు కాసింత ఊరట కలిగించేలా ప్రభుత్వ నిర్ణయం ఉందన్న మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యాంకుల వద్ద తగినంత కరెన్సీ లేదు. ఈ నేపథ్యంలో విత్ డ్రా మీద ఏవో కొన్ని ఆంక్షలు పెట్టకుంటే.. అందరూ నగదు విత్ డ్రా చేసుకుంటే ఇబ్బంది కానుంది. అందుకే.. నగదు విత్ డ్రా మీద సర్ ఛార్జ్ విధించటం ద్వారా.. బ్యాంకుల్లో నగదు అవసరానికి తప్ప బయటకు తీయకూడదన్న భావన ప్రజల్లో కలిగేలా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. రోజుకు బ్యాంకులో విత్ డ్రా చేసే మొత్తం రూ.50వేలకు మించినా.. ఏటీఎంల నుంచి రోజుకు రూ.15వేలకు మించి విత్ డ్రా చేసుకున్న పక్షంలో 0.5 శాతం నుంచి 2 శాతం వరకూ సర్ ఛార్జ్ రూపంలోవసూలు చేయనున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా బయటకు వెల్లడి కాలేదు.

ఈ తరహా నిబంధనను నాలుగైదు నెలల్లో అమలు చేసి.. ఆలోపు మరిన్ని కొత్త నిర్ణయాల్ని అమల్లోకి తీసుకురావాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది.మొత్తంగా చూస్తే.. నగదు లావాదేవీల్ని వీలైనంతవరకూ నిరుత్సాహానికి గురి చేసి.. డిజిటల్ చెల్లింపుల దిశగా ప్రజల్ని సమాయుత్తం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇక.. రానున్నరోజుల్లో రూ.3లక్షలకు మించిన లావాదేవీలు జరగకుండా పూర్తిగా నిషేధం విధించటం.. ప్రతి కుటుంబం రూ.15లక్షలకు మించిన నగదును ఉంచుకోవటాన్ని నిషేధించటం.. ప్రభుత్వ సంస్థలకు రూ.లక్షకు పైనే నగదు చెల్లింపులపై సర్ ఛార్జ్ విధించే అంశం పైనా కీలక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. ఇవన్నీ కానీ వాస్తవ రూపం దాలిస్తే.. నగదు చెల్లింపుల్లోనూ.. నగదు వినియోగంలోనూ పెను మార్పులు చోటు చేసుకోవటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/