Begin typing your search above and press return to search.

తొలి రోజే తేడా?; బాబు అలా.. సురేశ్ ప్రభు ఇలా

By:  Tupaki Desk   |   4 Jun 2016 1:36 PM GMT
తొలి రోజే తేడా?; బాబు అలా.. సురేశ్ ప్రభు ఇలా
X
రాజ్యసభకు ఏపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురిలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఒకరు. మిత్రధర్మంలో భాగంగా బీజేపీ చీఫ్ అమిత్ షా అడిగిన మీదట రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు రాజ్యసభ సీటును కేటాయించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే చేయటం తెలిసిందే. సురేశ్ ప్రభు కానీ రాజ్యసభ సభ్యుడైతే.. తనను రాజ్యసభకు పంపిన ఏపీ అధినేత చంద్రబాబు సర్కారుకు లాభం చేకూరేలా పలు ప్రాజెక్టులు ఏపీకి కేటాయిస్తారని.. మరి ముఖ్యంగా విశాఖకు రైల్వే జోన్ సాధన ఈజీ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. అదంత ఈజీ కాదన్న విషయం రెండోరోజే అర్థమైన పరిస్థితి.

రాజ్యసభ సభ్యుడిగా శుక్రవారం ఎంపికైన సురేశ్ ప్రభు.. శనివారం మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తనను ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. తమ తరఫున ఎన్నుకున్న సురేశ్ ప్రభు పుణ్యమా అని ఏపీకి ఎంతో ప్రయోజనం కలగటం ఖాయమని నమ్ముతున్న చంద్రబాబు సర్కారుకు షాకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త డౌట్స్ కు తెర తీసేలా ఉండటం గమనార్హం.

మీడియాతో మాట్లాడిన సందర్భంగా విశాఖకు రైల్వే జోన్ అంశానికి సంబంధించి విభజన చట్టంలో.. ఈ విషయాన్ని పరిశీలించమని చెప్పిందే తప్పించి.. రైల్వే జోన్ ఇవ్వాలంటూ పేర్కొనలేదంటూ నెగిటివ్ వ్యాఖ్య చేయటం గమనార్హం. రైల్వే జోన్ అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్లుగా పేర్కొన్నారు. విశాఖ జోన్ తో సంబంధం లేకుండా ఏపీలో సంస్కరణలు చేపట్టినట్లుగా పేర్కన్నారు. సురేశ్ ప్రభు మాటలతో ఏపీ సర్కారుకు షాక్ తో పాటు.. సీమాంధ్ర ప్రజలకు పలు సందేహాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఇదిలా ఉంటే..రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. ఆయనతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బాబు మాట్లాడుతూ.. విశాఖకు రైల్వే జోన్ విషయమైన సురేశ్ ప్రభుతో మాట్లాడానని.. ఈ అంశాన్ని పరిశీలిస్తానని కేంద్రమంత్రి తనతో చెప్పినట్లుగా బాబు పేర్కొనటం విశేషం. ఓపక్క విభజన చట్టంలో రైల్వే జోన్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేయమని చెప్పలేదని.. ఈ విషయాన్ని పరిశీలించమని మాత్రమే చెప్పిందని సురేశ్ ప్రభు పేర్కొనటం చూస్తే.. రైల్వే మంత్రిని ఎంపిక చేశామన్న సంతోషాన్ని ఏపీ ప్రజలకు ఆయన ఒక్కరోజు మాత్రమే మిగిల్చినట్లుగా కనిపిస్తోందే.