Begin typing your search above and press return to search.

ఏపీ జోన్ మీద రైల్వే మంత్రి ఏం చెప్పారంటే..

By:  Tupaki Desk   |   26 Jun 2016 4:50 AM GMT
ఏపీ జోన్ మీద రైల్వే మంత్రి ఏం చెప్పారంటే..
X
మోడీ క్యాబినెట్ లో మంత్రులు చాలా మందే ఉన్నా.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తీరే వేరుగా ఉంటుంది. ఆయనకున్న ఛరిష్మా ఎంతంటే.. ఏపీకి ఏమీ చేయని మోడీ మీద ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. ఆయన నేతృత్వం వహిస్తున్న బీజేపీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యసభ సీటు ఒకటి కేటాయించటాన్ని చాలామంది ఇష్టపడలేదు. కానీ.. తాను కేటాయిస్తున్న సీటు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కోసమన్న మాట బయటకు వచ్చిన వెంటనే వ్యతిరేక రాగం ఆలపించిన వారంతా ఓకే అనేసిన పరిస్థితి. అదీ.. సురేశ్ ప్రభు అంటే. సాదాసీదాగా ఉండటం.. పని మీద ఫోకస్ తప్పించి మరే విషయాల్ని పెద్దగా పట్టించుకోని ఆయన తత్వంతో రైల్వేల్లో ఇప్పటికే మార్పు మొదలైంది. ఒక చిన్న ట్వీట్ తో దేశంలోని ఏ మూలన రైల్లో ప్రయాణిస్తున్నా నిమిషాల వ్యవధిలో సాయం అందటం గురించి గతంలో ఎప్పుడైనా విన్నామా? అసలు ఊహించామా? ఇదంతా ప్రభు పుణ్యమేనని చెప్పాలి.

ఏపీ రాజ్యసభ కోటా నుంచి ఎంపికైన ప్రభు మీద ఏపీ ప్రజలు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఆ మాటకు వస్తే రెండు రాష్ట్రాల తెలుగువారిదీ ఇదే పరిస్థితి. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రైల్వే మంత్రి ప్రాతినిధ్యం వహించటం ఇదే మొదటిసారి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. విభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన నష్టాన్ని సరిదిద్దే చర్యల్లో భాగంగా ఏపీకి జోన్ ను కేటాయించాలన్న హామీని విభజన చట్టంలో చేర్చారు. విభజన జరిగి రెండేళ్లు అవుతున్నా.. విభజన చట్టంలో హామీ ఇచ్చిన రీతిలో రైల్వే జోన్ కు సంబంధించి ఎలాంటి కీలక పరిణామం చోటుచేసుకోలేదు.

అప్పుడప్పుడు ఒకట్రెండు వార్తలు రావటం తప్పించి.. జోన్ మీద రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నోట్లో నుంచి స్పష్టమైన మాట ఏదీ ఇప్పటి వరకూ రాలేదు. తొలిసారి ఈ అంశం మీద కాస్త డీటైల్డ్ గా మాట్లాడారు రైల్వేమంత్రి. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీకి జోన్ వ్యవహారం మీద అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ విషయం మీద రైల్వే మంత్రి ఏం చెప్పారన్నది చూస్తే.. ‘‘రైల్వే జోన్ ఏర్పాటుకున్న అవకాశాలను అన్వేషించాలని.. ఆర్థికంగా మనుగడనూ చూడాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టారు. గత ప్రభుత్వమే ఆ పని చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. అది చేయలేదు కాబట్టి.. మేం అన్నిభాగస్వామ్య వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ విషయంలో మేం సాధ్యమైనంత చేస్తున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు.

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. రైల్వేజోన్ కచ్ఛితంగా ఇవ్వాలన్నట్లుగా చట్టంలో పేర్కొనలేదన్న మాట సురేశ్ ప్రభు నోట రావటమే కాదు.. అదేదో కాంగ్రెస్ సర్కారే చేసి ఉంటే బాగుండేదన్న మాట చెప్పటం ద్వారా.. ఏపీకి జోన్ కేటాయించటం వెనుక ఉన్న ఇబ్బందల్ని ఆయన చెప్పకనే చెప్పారని చెప్పాలి. తాము సాధ్యమైనంతగా చేస్తున్నామనే చెప్పారే కానీ.. కచ్ఛితంగా ఆ హామీని పూర్తి చేస్తామని చెప్పకపోవటం చూసినప్పుడు.. ఏపీకి జోన్ అంత తేలిగ్గా రాదన్న సంకేతాల్ని ఇచ్చినట్లుగానే భావించాలి. ఏపీకి రైల్వే జోన్ మీద సరేశ్ ప్రభు నోరు విప్పిన నేపథ్యంలో అర్థమయ్యేది ఒక్కటే.. చట్టంలో ఉన్నప్పటికీ అమల్లోకి రావటం అంత తేలిక కాదని.