Begin typing your search above and press return to search.

ఐటీ కుర్రాడి ఫిర్యాదుకు కేంద్రమంత్రి కదిలారు

By:  Tupaki Desk   |   15 Dec 2015 4:25 AM GMT
ఐటీ కుర్రాడి ఫిర్యాదుకు కేంద్రమంత్రి కదిలారు
X
దేశంలో ప్రభుత్వ వ్యవస్థలు మందకొడిగా పని చేస్తాయని.. వాటిల్లో చలనం అస్సలు ఉండదని చాలామంది విమర్శలు చేస్తుంటారు. జేమ్స్ బాండ్ తరహాలో తాజాగా భారతీయ రైల్వేలు స్పందిస్తున్న తీరు ఇప్పుడు విస్మయంగా మారటమే కాదు.. టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా రైల్వే ప్రయాణికులు ఎవరైనా సరే.. ఇబ్బందుల్లోకి గురైన.. తాము పడుతున్న వేదనను ట్వీట్ చేస్తే చాలు.. యుద్ధ ప్రాతిపదికన సాయం అందటం ఇప్పుడు అందరూ కొత్తగా చెప్పుకుంటున్నారు.

సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్ ద్వారా భారతీయ రైల్వే.. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభులకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లో ఏ చిన్న సమస్యను వెలుగులోకి తెచ్చినా వాటిపై తీవ్ర చర్యలు తీసుకోవటం ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతోంది. తాజా ఉదంతం వింటే.. ఇంత చిన్న విషయంలో ఇంత తీవ్రంగా స్పందించారా? అన్న సందేహం కలగటం ఖాయం.

అమన్ నారంగ్ అనే ఐటీ ఉద్యోగి 12241 ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. రిజర్వేషన్ బోగీలో ఉన్న అతగాడి దగ్గర వాటర్ బాటిల్ రూ.15 అయితే.. దాన్ని రూ.20 వసూలు చేశారు. కడుపు మండిపోయిన అతగాడు.. వెంటనే తన మొబైల్ బయటకు తీసి.. తన పీఎన్ ఆర్ నెంబరుతో పాటు.. తాను ప్రయాణిస్తున్న ట్రైన్ నెంబరు తీసి.. వాటర్ బాటిల్ మీదున్న ఎమ్మార్పీ.. సదరు సేల్స్ మెన్ రూ.20కు అమ్మిన వైనం గురించి ఫిర్యాదు చేశారు.

అంతే.. స్పందించిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా కేంద్ర రైల్వే మంత్రి సీన్ లోకి రావటంతో అధికారులు సదరు క్యాటరింగ్ సంస్థకు రూ.10వేల జరిమానా వేయటంతో పాటు.. భవిష్యత్తులో తాము ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతామని పేర్కొనటంతో.. అమన్ నారంగ్ లాంటి వారికి ఏమీ అర్థం కాని పరిస్థితి. తనను మోసం చేసిన వ్యక్తిపై క్షణాల్లో చర్యలు తీసుకోవటం విపరీతమైన ఆనందానికి గురి అవుతున్నారు. ఒక సామాన్యుడి ట్వీట్ కు.. కేంద్ర రైల్వే మంత్రి రియాక్ట్ అయ్యే రోజులు రావటానికి మించిన హ్యాపీ మరింకేం ఉంటుంది.?