Begin typing your search above and press return to search.

ఐసీసీ క‌ప్పు దాకా ఎందుకు.. కోహ్లీ ఐపీఎల్ కూడా గెల‌వ‌లేః రైనా

By:  Tupaki Desk   |   12 July 2021 11:30 AM GMT
ఐసీసీ క‌ప్పు దాకా ఎందుకు.. కోహ్లీ ఐపీఎల్ కూడా గెల‌వ‌లేః రైనా
X
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాలెంట్ పై ఎవ్వ‌రికీ రెండో అభిప్రాయం ఉండ‌క‌పోవ‌చ్చు. విరాట్ ఎలాంటి ఆట‌గాడ‌న్న‌ది అత‌ని రికార్డులే చెబుతాయి. అంత‌ర్జాతీయ క్రికెట్లో ఇప్ప‌టికే 70 సెంచ‌రీలు (టెస్టులు, వ‌న్డేలు) సాధించి.. ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ గా ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా.. త‌న‌దైన దూకుడుతో విధ్వంసం సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తాడు. అయితే.. ఇదంతా వ్య‌క్తిగ‌త ఘ‌న‌త‌. మ‌రి, కెప్టెన్ గా ఆయ‌న స‌త్తా ఏంటీ? అన్న‌ప్పుడు మాత్రం త‌ర‌చి చూసుకోవాల్సిన ప‌రిస్థితి.

అంత‌ర్జాతీయ వేదిక‌పై నాయ‌కుడిగా ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌ని తాను నిరూపించుకోలేదు. మొన్న‌టికి మొన్న ఆ ఛాన్స్ వ‌చ్చినా వినియోగించుకోలేక‌పోయాడు. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ను న్యూజిలాండ్ కు స‌మ‌ర్పించుకొని, విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. అయితే.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ మాట్లాడిన మాట‌లు కూడా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. మైదానంలో.. విజ‌య‌మా? వీర స్వర్గమా? అన్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు కోహ్లి. అంతి ల‌క్ష్యం గెలుపే అన్న‌ట్టుగా ఆడుతుంటాడు. అలాంటి కోహ్లీ.. ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఓడిపోతే ప్ర‌పంచం ఆగిపోదు అని అన్నాడు. అంతేకాదు.. ఇది కూడా ఓ సాధార‌ణ మ్యాచ్ అనేశాడు. గ‌తంలో ఎన్నో జ‌ట్లు ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయాయని, ఇది ఒక ఆట అని మాత్ర‌మే అంద‌రూ అర్థం చేసుకోవాలి అంటూ.. వేదాంతం మాట్లాడాడు. కోహ్లీ నుంచి ఈ త‌ర‌హా మాట‌లు విన్న‌వారంతా అవాక్క‌య్యారు. ఇదంతా మాట్లాడేది నిజంగా కోహ్లీనేనా? అని ఆశ్చ‌ర్య‌పోయారు.

''చ‌రిత్ర‌ను ఒక‌సారి ప‌రిశీలించండి. ఎంద‌రో ఎన్నో మ్యాచులు ఎడిపోయారు. దాన్ని బ‌ట్టి ఇదొక క్రీడ అని అర్థ‌మ‌వుతుంది. మేము ఈ ఫైన‌ల్ గెలిచినా.. ఓడినా.. మా క్రికెట్ ఇక్క‌డితో ఆగిపోదు. అందుకే.. ఈ ఫైన‌ల్ ను ప్ర‌త్యేకంగా చూడ‌ట్లేదు. ఇది మ‌రో మ్యాచ్ అంతే. బ‌య‌టి జ‌నాలే అతిగా ఆరాట ప‌డుతున్నారు. చావో రేవో అన్న‌ట్టు భావిస్తారు'' అని కోహ్లీ అన్నాడు. విరాట్ వ్యాఖ్య‌లు విని క్రికెట్ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఇలా వ్యాఖ్యానించ‌డం ద్వారా.. ఈ ఫైన‌ల్లో ఇండియా ఓడిపోయే అవ‌కాశం ఉంద‌ని ఇండైరెక్ట్ గా చెబుతున్నాడా? అనే అనుమానం కూడా వ్య‌క్తం చేశారు. సందేహించిన‌ట్టుగానే టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ లో భార‌త్ ఓడిపోయింది. సువ‌ర్ణావ‌కాశాన్ని చేజార్చుకుంది.

దీంతో.. కోహ్లీపై విమ‌ర్శ‌లు వ‌ర్షం మొద‌లైంది. వాస్త‌వానికి కోహ్లీని రెండు ఫార్మాట్ల‌కు కెప్టెన్ గా ఉంచ‌డం స‌రికాద‌ని, వ‌న్డేల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసి, టెస్టు ప‌గ్గాలు వేరే వాళ్ల‌కు అప్ప‌గించాల‌నే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయినా.. బీసీసీఐ కోహ్లీనే కొన‌సాగిస్తోంది. విరాట్ మాత్రం ఒక నాయ‌కుడిగా త‌న‌ను నిరూపించుకోవ‌డం విఫ‌లం అవుతున్నాడు. ఇంగ్లండ్ లో టెస్టు ఫైన‌ల్ కు ముందు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లోనూ తొలి టెస్టులో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత కోహ్లీ ఇంటికి రావ‌డం.. ఆ త‌ర్వాత ర‌హానే సార‌థ్యంలో భార‌త్ స‌త్తా చాటి, ఆస్ట్రేలియాను ఓడించి, ఏకంగా సిరీస్ గెల‌వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. దీంతో.. కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వ‌దిలేయాల‌నే డిమాండ్ మ‌రింత పెరిగింది.

ఈ క్ర‌మంలోనే మాజీ ఆట‌గాడు సురేష్ రైనా మాట్లాడుతూ.. కోహ్లీ గొప్ప కెప్టెన్ అని, అయితే.. అత‌ను ఐసీసీ ట్రోపీ గెలిచేందుకు ఇంకాస్త టైమ్ ప‌డుతుంద‌ని అన్నాడు. అదే స‌మ‌యంలో ఐపీఎల్ ట్రోఫీ కూడా గెల‌వ‌లేద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ''కెప్టెన్ గా కోహ్లీ సత్తా ఏంటో అతని రికార్డులే చెబుతాయి. ఈ ప్ర‌పంచంలో అత‌నే నెంబ‌ర్ 1 బ్యాట్స్ మెన్‌. చాలా మంది ఐసీసీ టైటిల్ గురించి మాట్లాడుతున్నారు. కానీ.. అత‌డు ఇప్ప‌టి దాకా ఐపీఎల్ ట్రోపీ కూడా గెల‌వ‌లేదు.'' అన్నాడు. అయితే.. వరుసగా మూడు మేజర్ టోర్నీల్లో ఫైనల్ చేరిందని, తృటిలో క‌ప్పు చేజారింద‌ని అన్నాడు. అయినా.. ప్ర‌తిసారీ ఫైన‌ల్ చేర‌డం అంత ఈజీకాదు, కోహ్లీకి కాస్త స‌మ‌యం ఇవ్వాల‌ని రైనా అన్నాడు.

దీంతో.. కోహ్లీ కెప్టెన్సీ అంశం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. నిజానికి 2013 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు కోహ్లీ. ఇప్ప‌టి వ‌ర‌కూ 196 మ్యాచులు ఆడిన కోహ్లీ.. 6000 ప‌రుగులు సాధించాడు. ఈ మార్క్ చేరుకున్న మొద‌టి బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నిలిచాడు. కానీ.. కెప్టెన్ గా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ టైటిల్ కొట్ట‌లేదు. అరంగేట్రం నుంచి బెంగ‌ళూరు టీమ్ లోనే కోహ్లీ.. 2013లో కెప్టెన్ అయ్యాడు. ఎప్ప‌టిక‌ప్పుడు టైటిల్ కొట్టాల‌ని చూస్తున్నా.. అది సాధ్యం కావ‌ట్లేదు.