Begin typing your search above and press return to search.

బద్వేల్ లో బీజేపీ కి సురేష్ బలం...?

By:  Tupaki Desk   |   7 Oct 2021 6:03 AM GMT
బద్వేల్ లో బీజేపీ కి సురేష్ బలం...?
X
బీజేపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి డిసైడ్ అయింది. కుటుంబ రాజకీయాలను తాము అసలు ఒప్పుకోమని చెబుతూ బీజేపీ పోరులో ముందుకు వచ్చింది. బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేయడానికి కీలక నేతనే ఎంపిక చేసింది. జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న పుంతల సురేష్ ని ఆ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. రైల్వే కోడూరుకు చెందిన సురేష్ ప్రస్తుతం బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన దాదాపుగా పద్నాలుగేళ్ల పాటు ఏపీలో ఏబీవీపీ తరఫున పనిచేశారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన సురేష్ అభ్యర్ధిత్వం తమకు అన్ని విధాలుగా కలసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

ఇక బీజేపీ ఒక జాతీయ పార్టీగా అన్ని ఎన్నికల్లో పాల్గొంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే తాము పోటీలో ఉన్నామని కూడా అంటున్నారు. ఇక బద్వేల్ లో ఎవరు పోటీలో ఉన్నా కూడా వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుధ గెలుపు ఖాయమే అని అంటున్నారు. అయితే బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నదే ఇక్కడ చర్చ. నిజానికి బద్వేల్ లో బీజేపీ 2009 ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే 1415 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో సింగమల వెంకటేశ్వర్లు పోటీ చేశారు. ఇక 2014 ఎన్నికల వేళ చూస్తే టీడీపీతో పొత్తున్న కారణంగా బీజేపీ పోటీ పెట్టలేదు.

అలాగే 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి బద్వేల్ లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మరి ఇపుడు ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నదే చర్చ. నిజానికి టీడీపీ పోటీ చేయడంలేదు. మరో వైపు జనసేన కూడా బరి లో నుంచి తప్పుకుంది. దాంతో ఈ రెండు పార్టీల ఓటు బ్యాంక్ మీదనే ఆధారపడి బీజేపీ రేసులో ఉంది అంటున్నారు. మరి ఒకనాడు టీడీపీకి చెందిన వారే ఇపుడు బీజేపీలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కానీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కానీ బీజేపీకి టీడీపీ ఓట్ల నుంచి ఎంత మేరకు వేయించగలరు అన్నదే చూడాలి. ఇక జనసేన రేసులో లేదు. ఆ పార్టీ అభిమానులు కానీ క్యాడర్ కానీ ఓటేస్తే కచ్చితంగా బీజేపీకే అన్న ఆశ కూడా కమలనాధుల్లో ఉందిట. మొత్తానికి సురేష్ ని ముందు పెట్టి బద్వేల్ ఉప ఎన్నిక ద్వారా తన ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది.