Begin typing your search above and press return to search.

సీఎం జగన్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని చూపిస్తూ ఆ రోగికి సర్జరీ

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:22 AM GMT
సీఎం జగన్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని చూపిస్తూ ఆ రోగికి సర్జరీ
X

మెదడుకు సంబంధించిన కొన్ని సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు సదరు పేషెంట్ మెలుకవతో ఉండాల్సి ఉంటుంది. అలాంటి వేళ సినిమాలు చూపించటం.. వారికి ఇష్టమైన మ్యూజిక్ వీడియోను వినిపిస్తూ క్లిష్టమైన సర్జరీని చేస్తుంటారు.తాజాగా అలాంటి ఉదంతం ఒకటి ఏపీలో జరిగింది. కానీ.. సదరు రోగికి సర్జరీలో భాగంగా అతగాడు ఎంతగానో అభిమానించే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వీడియో చూపిస్తూ ఆపరేషన్ నిర్వహించారు.

సదరు సర్జరీ సక్సెస్ అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సదరు సర్జరీని ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఉచితంగా నిర్వహించటం.

ప్రకాశం జిల్లాకు చెందిన 43 ఏళ్ల పెద ఆంజనేయులు ఏడేళ్లుగా ఎన్ని మందులు వాడుతున్నా ఫిట్స్ తగ్గట్లేదు. దీంతో అతనికి గుంటూరులోని వైద్యులకు చూపించారు. అతడికి జరిపిన పరీక్షల్లో మెదడులోని కీలకమైన ఫ్రంటల్ ఫ్రీ మోటార్ ప్రాంతంలో 7.5 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. కాలు.. చేయి పని తీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో కణితి ఉంది.

దీంతో.. దానికి సర్జరీ చేసే వేళలో పేషెంట్ మెలుకవతో ఉండాలని.. మెదడు చురుగ్గా పని చేసేలా ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. ఆ పేషెంట్ కు సర్జరీ చేసేందుకు సిద్ధమైన వైద్యులు.. అతడికి ఎంతో ఇష్టమైన అగ్నిపర్వతం సినిమాను.. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని చూపిస్తూ సర్జరీ చేశారు.

సినిమా మధ్యలో ఆపి.. సీఎం జగన్ ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించటం గమనార్హం. తాను సీఎం జగన్ ను అమితంగా అభిమానిస్తానని సదరు పేషెంట్ చెప్పటంతో.. సర్జరీలో కీలకమైన వేళలో.. ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూపిస్తూ.. పేషెంట్ తో మాట్లాడుతూ సర్జరీ చేపట్టారు.

తాజాగా సదరు రోగి పూర్తిగా కోలుకోవటంతో అతడ్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా అతడికి సర్జరీ చేసిన సమయంలో చేపట్టిన ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఖరీదైన ఈ సర్జరీని పూర్తి ఉచితంగా చేయటం గమనార్హం.

ప్రభుత్వ పథకాలు కొన్ని సామాన్యుల ప్రాణాల్ని ఏ రీతిలో కాపాడతాయన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పక తప్పదు.