Begin typing your search above and press return to search.

ఆంధ్రా లడ్డూతో ‘గిన్నిస్’ గ్యారెంటీ అట

By:  Tupaki Desk   |   27 Aug 2016 4:46 AM GMT
ఆంధ్రా లడ్డూతో ‘గిన్నిస్’ గ్యారెంటీ అట
X
వినాయకచవితి వస్తుందంటే చాలు వినాయక మండపాల హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక.. పోటాపోటీగా నిర్వహించే గణేష్ మండపాల ఏర్పాటు ఒక ఎత్తు అయితే.. వినాయకుడికి ప్రసాదంగా తయారు చేయించే లడ్డూ లెక్క మరొక ఎత్తు. అందరి కంటే భారీ లడ్డూను తయారు చేయించేందుకు పలువురు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. భారీ తనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి తగ్గట్లే వేలాది కేజీల లడ్డూను ప్రత్యేకంగా తయారు చేయిస్తుంటారు. వినాయకుడి విగ్రహాన్ని ఎంత ప్రత్యేకంగా చూస్తారో.. ఖైరతాబాద్ గణేషుడి కోసం తయారు చేయించే లడ్డూను అంతే ప్రత్యేకంగా చూడటం కనిపిస్తుంది.

అయితే.. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడికి తయారు చేయించే లడ్డూను 500 కేజీలకే పరిమితం చేయటంతో..భారీతనం విషయంలో ఈసారికి బ్రేకులు పడ్డట్లే. ఇదిలా ఉంటే.. భారీతనం విషయంలో తాము తగ్గేది లేదన్నట్లుగా ఏపీలోని విశాఖపట్నం వాసులు డిసైడ్ అయ్యారు. విశాఖలోని గాజువాకలో ఏర్పాటు చేస్తున్న మహా గణపతికి భా..రీ లడ్డూను ప్రసాదంగా రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకోసం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ కు భారీ లడ్డూ తయారీ ఆర్డర్ ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకూ 11,115 కేజీల లడ్డూను మాత్రమే తయారు చేయగా.. దాన్ని బీట్ చేసేందుకు ఏకంగా 12,500 కేజీల లడ్డూను తయారు చేసేలా ఆర్డర్ ఇచ్చారు గాజువాక వాసులు.

దాదాపు రూ.30 లక్షల ఖర్చుతో తయారు చేయించే ఈ లడ్డూతో సరికొత్త రికార్డు నెలకొల్పడటమే కాదు.. గిన్నిస్ లో ఎక్కే అవకాశం లభించనుంది. ఖైరతాబాద్ గణేషుడి కోసం తయారు చేస్తున్న లడ్డూ కంటే వందల రెట్లు ఎక్కువగా ఉండే ఈ భా..రీ లడ్డూ ఈసారి వినాయకచవితికి హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. గాజువాక ప్రాంతానికి చెందిన వారు ఇచ్చిన ఆర్డర్ తో భారీ లడ్డూ రికార్డు ఏపీ పేరిట గిన్నిస్ లో నమోదు కానుందన్న మాట.