Begin typing your search above and press return to search.

తెలుగోళ్ల బతుకుల ‘లెక్క’ చూశారా చంద్రుళ్లు?

By:  Tupaki Desk   |   23 Feb 2016 4:26 AM GMT
తెలుగోళ్ల బతుకుల ‘లెక్క’ చూశారా చంద్రుళ్లు?
X
నిత్యం విజన్ గురించి మాట్లాడుతూ.. హైటెక్ ముఖ్యమంత్రిగా దేశ వ్యాప్తంగా సుపరిచితులైన నేతగా గుర్తింపు ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సంపన్నులన్న విషయం తాజాగా బయటకొచ్చింది. అంతేకాదు.. తమది సంపన్నరాష్ట్రమని.. ధనిక రాష్ట్రమని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకపై మరో అంశాన్ని కూడా గుర్తించాల్సిన సమయం వచ్చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ నమూనా సర్వేలో తెలుగు ప్రాంతాల ప్రజల ఆర్థిక వెనుకబాటు విషయం తెరపైకి వచ్చింది. ఆర్థికంగా తెలుగోళ్లు ఎంత స్థితిమంతులన్న విషయాన్ని తాజా అధ్యయనం చెప్పకనే చెప్పేసింది.

నిత్యం గొప్పలు చెప్పుకునే ఇద్దరు చంద్రుళ్లు.. ఈ అధ్యయనాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ వ్యాప్తంగా తెలుగువాళ్ల దుస్థితి.. వారి ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు చంద్రుళ్లు ఇద్దరూ కంకణం కట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుల్లో ముందు.. ఆస్తుల్లో వెనుకగా ఉన్న ప్రజల బతుకుల్ని మార్చాల్సిన అవసరం ఎంతన్నది తాజా సర్వే చెప్పేసింది.

తాజా నమూనా సర్వే ప్రకారం.. దేశ వ్యాప్తంగా రుణభారం అధికంగా ఉన్న గ్రామీణ కుటుంబాల్లో తెలంగాణ రైతు కుటుంబాలే అత్యధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వెయ్యి కుటుంబాలకు సగటున 694 కుటుంబాలు క్యాష్ ను అప్పుగా తీసుకుంటున్నట్లుగా తేల్చారు. ఒక్కో కుటుంబానికి సరాసరిన రూ.68,485 అప్పు ఉన్నట్లు తేలింది.

వ్యవసాయ కుటుంబాలకు తప్ప ఇంత భారీ అప్పు మరే రంగానికి చెందిన కుటుంబాలకు లేదన్న విషయం బయటకు వచ్చింది. అంతేకాదు.. పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రంలో రైతుకు ఉండే సగటు అప్పు కంటే తెలంగాణ రైతు కుటుంబానికి రెట్టింపు రుణభారంతో విలవిలలాడుతున్న విషయం వెల్లడైంది. తెలంగాణ రైతు తర్వాత అప్పుల ఊబిలో ఉన్నది ఆంధప్రదేశ్ రైతేనని తేలింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. తెలంగాణ గ్రామీణ ప్రాంతం అప్పుల ఊబిలో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. పట్టణ ప్రాంత కుటుంబాలు రుణభారం విషయంలో దేశంలో ఆరో స్థానంలో నిలిచింది.

ఈ నివేదికలో వెల్లడైన మరిన్ని వాస్తవాలు..

= అప్పుల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం తొలుత ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో ఆంధప్రదేశ్ గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలు ఉన్నాయి

= పట్టణ ప్రాంతాల అప్పుల్లో కేరళ తొలి స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. ఆరో స్థానంలో తెలంగాణ ఉంది

= పట్టణ ప్రాంతంలోని ఆస్తుల్లో అత్యధిక విలువ చండీగఢ్ కు ఉంది. ఒక్కడ ఒక్కో కుటుంబం ఆస్తి సగటున రూ.94.25 లక్షలుగా తేలింది

= దేశంలోని మరే ప్రాంత ప్రజలకు.. చండీగఢ్ పట్టణ ప్రాంత ప్రజల సరాసరి ఆస్తిలో సగం కూడా లేదు

= తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబ సగటు ఆస్తి రూ.6.37లక్షలు అయితే.. పట్టణాల్లో రూ.18.43 లక్షలు

= ఆంధప్రదేశ్ గ్రామీణ కుటుంబ సగటు ఆస్తి విలువ రూ.4.11లక్షలు అయితే.. పట్టణాల్లో రూ.9.90లక్షలు

= గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి విలువ ఎక్కువగా ఉన్నది ఢిల్లీ గ్రామీణ కుటుంబాలుగా తేలింది. ఇక్కడి వారి సగటు ఆస్తి రూ.1.11కోట్లు

= గ్రామీణ ప్రాంతాల్లోనగలున్న ప్రజల్లో కర్ణాటకలో 94 శాతం ఉంటే.. తెలంగాణలో 90 శాతం.. ఏపీలో 82 శాతం మాత్రమే ఉంది

= దేశ వ్యాప్తంగా రైతు కుటుంబాలకు ఉన్న ఆస్తి విలువను లెక్కేస్తే.. అత్యధికంగా ఢిల్లీ రైతు కుటుంబానికి సగటున రూ.1.67 కోట్లు ఉండగా.. పంజాబ్ రైతు కుటుంబ ఆస్తి విలువ రూ.88.51లక్షలుగా తేలింది. దీన్లో 15 శాతం విలువ కూడా తెలుగు రైతులకు లేకపోవటం గమనార్హం.