Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్‌కి మెంట‌లెక్కిస్తున్న స‌ర్వే ఫ‌లితాలు

By:  Tupaki Desk   |   30 March 2016 6:25 AM GMT
మోడీ బ్యాచ్‌కి మెంట‌లెక్కిస్తున్న స‌ర్వే ఫ‌లితాలు
X
ఆ మ‌ధ్య‌న జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌ర్ త‌మ‌దేన‌ని బ‌డాయి క‌బుర్లు చెప్పిన బీజేపీకి బీహారీలు ఇచ్చిన తీర్పున‌కు క‌మ‌ల‌నాధుల‌కు ఎలాంటి షాక్ త‌గిలిందో తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోవ‌టానికి వారు చాలాకాల‌మే ప‌ట్టింది. జాతీయ స్థాయిలో మోడీ ఇమేజ్‌ను భారీగా దెబ్బ తీసిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఒక‌టిగా చెప్పాలి.

తాజాగా ఐదు రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీకి భారీ షాక్ ఇచ్చేందుకు బెంగాలీలు ప్రిపేర్ అయిపోయారా? అంటే అవున‌నే చెబుతోంది ఓ స‌ర్వే. స‌ద‌రు స‌ర్వే నిర్వ‌హించిన మీడియా సంస్థ ఏమైనా అల్లాట‌ప్పాదా అంటే కాద‌నే చెప్పాలి. ఉత్త‌రాదిన మాంచి నెట్ వ‌ర్క్ ఉన్న మీడియా సంస్థ‌. ఆ సంస్థ చేప‌ట్టిన తాజా స‌ర్వేలో షాక్ తినే ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఐదు రాష్ట్రాల‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో ఒక్క అసోం త‌ప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో (త‌మిళ‌నాడు.. పుదుచ్చేరి.. కేర‌ళ‌.. ప‌శ్చిమ‌బెంగాల్‌) బీజేపీ ఎలాంటి ప్ర‌భావం చూపించ‌ద‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ఒక స్ప‌ష్ట‌త ఉంది.

అయితే.. ఈ నాలిగింటిలో ప‌శ్చిమ‌బెంగాల్ మీద బీజేపీ కొద్దిపాటి ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. ఈ ఆశ‌ల మీద నీళ్లు జ‌ల్ల‌ట‌మే కాదు.. ఘోర అవ‌మానం ఎదురుకావ‌టానికి రెఢీగా ఉందంటూ ఎబీపీ అలియాస్ ఆనంద్ బ‌జార్ ప‌త్రిక మీడియా సంస్థ త‌న తాజా స‌ర్వేలో తేల్చింది. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి చేప‌ట్టే స‌ర్వేల‌కు సంబంధించి మంచి ప‌ట్టున్న మీడియా సంస్థ‌గా పేరున్న ఏబీపీ ఒక సంచ‌ల‌న అంశాన్ని వెల్ల‌డించింది. ప‌శ్చిమ‌బెంగాల్‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ రెండోసారి అధికారాన్ని చేప‌ట్టటం ఖాయ‌మ‌ని తేల్చింది. అదే స‌మ‌యంలో బీజేపీకి ఈ ఎన్నిక‌ల్లో చుక్క‌లు క‌నిపిస్తాయ‌ని.. ఘోర అవ‌మానం మూట‌గ‌ట్టుకోవ‌టం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పింది.

ఆ పార్టీకి ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా ద‌క్క‌ద‌ని వెల్ల‌డించింది. మొత్తం 294 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్న ప‌శ్చిమ‌బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు 197 సీట్లు చేజిక్కించుకుంటుంద‌ని.. క‌మ్యూనిస్ట్ పార్టీల‌కు 74 సీట్ల‌లో విజ‌యం సాధిస్తార‌ని.. కాంగ్రెస్ ఖాతాలో 16 సీట్లు మాత్ర‌మే ప‌డ‌తాయ‌ని.. మిగిలిన ఏడింటిలో ఇత‌రులు గెలుస్తార‌ని తేల్చింది. ఇంతా చేస్తే బీజేపీకి ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా ద‌క్క‌ద‌ని పేర్కొంది. ఈ స‌ర్వే ఫ‌లితాలు కానీ నిజ‌మైతే మోడీ అండ్ కో ఇమేజ్ ఎంత దారుణంగా దెబ్బ తింటుందో..?