Begin typing your search above and press return to search.

ఇప్పుడే ఎన్నకలొస్తే మోడీ పరిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   24 May 2017 8:32 AM GMT
ఇప్పుడే ఎన్నకలొస్తే మోడీ పరిస్థితి ఏంటి?
X
నరేంద్ర మోడీ మూడేళ్ళ పాలనకు ప్రజలు మంచి మార్కులే వేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా ముందుకెళ్తున్న మోడీ ప్రభుత్వానికి జనామోదం కనిపిస్తోంది. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నిర్వహించిన ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో దాదాపు 10 లక్షల మందికి పైగా పాల్గొనగా అందులో అధిక శాతం మోడీకి మద్దతుగా ఓటేశారు.

‘మోడీ ప్రభుత్వ పాలన కు మీరు ఏ విధంగా స్పందిస్తారు’ అన్న ప్రశ్నకు 77 శాతం మంది చాలా బాగుందని ఓట్‌ చేసినట్టు సర్వేలో తేలింది. జీఎస్టీ, నోట్ల రద్దు, లక్షిత దాడులు, స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ వంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేశాయని వెల్లడైంది. అధికశాతం ప్రజలు నోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయానికి మద్దతు పలకడం విశేషం.

కాగా దక్షిణ భారతంలో మోడీ సర్కారుకు కొంత వ్యతిరేక ఫలితాలు వెల్లడయ్యాయి. రైతుల సంక్షేమాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఆయన పరిపాలనలో అగ్రికల్చర్ సెక్టార్ బలహీనపడిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. వ్యవసాయరంగం తిరోగ‌మ‌నం బీజేపీ సర్కారుకు పెద్ద వైఫల్యమని సర్వేలో తేలింది. తమిళనాడు ప్రజానీకాన్ని మోడీ పరిపాలన పెద్దగా ఆకర్షించలేదు.

కాగా ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే మోడీ సర్కారు 2014 ఎలక్షన్స్‌ కంటే అద్భుత ఫలితాలను సాధిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్లేషించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 84 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 61 శాతం మంది మాత్రం 2014 ఎన్నికలంత ఘన విజయం లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 23 శాతం మంది మాత్రం 2014 ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమవుతాయని పేర్కొన్నారు. తృణమూల్, సీపీఐ మద్దతుదారులుగా భావిస్తున్న వారిలో 74 శాతం మంది కూడా బీజేపీనే గెలుస్తుందని చెప్పడం విశేషం.