Begin typing your search above and press return to search.

కమలానికి కష్టమే...!

By:  Tupaki Desk   |   19 Aug 2018 4:25 AM GMT
కమలానికి కష్టమే...!
X
రానున్న ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి కష్టకాలంగానే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా పలు సంస్ధలు - పత్రికలు - చానెళ్లు నిర్వహించిన సర్వేలో అదే తేలింది. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడైంది. మూడ్ ఆఫ్ నేషన్ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో కమలనాధులకు కష్టాలేనని తేలింది. ఆరు నెలల క్రితం జరిపిన సర్వేలో కాసింత అనుకూల వాతావరణం కనిపించినా ఇప్పుడున్న పరిస్ధితుల్లో మాత్రం కమలం గట్టెక్కడం సాధ్యమయ్యేలా లేదు. ముఖ్యంగా దేశంలో థర్డ్ ఫ్రంట్ రూపం తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కట్లు తప్పవని సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీకి ఈసారి చాలా తక్కువ సీట్లు వస్తాయని తేలింది. ఎన్‌ డిఎ భాగస్వామ్య పక్షాలకు కూడా అంత బాగా లేదని సర్వేలో వెల్లడైంది. భారతీయ జనతా పార్టీ మిత్రులతో కలిస్తే అతి కష్టం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్‌ డిఎ కూటమికి లోక్‌ సభలో 281 స్ధానాలు మాత్రమే వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం బీజెపి పాత స్నేహితులను వదులుకోకపోవడమే కాదు... కొత్తగా మరికొంత మందితో కూడా పొత్తు పెట్టుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో దేశవ్యాప్తంగా ఉన్న ఏ పార్టీ కూడా మిత్రత్వం నెరపే అవకాశాలు కనిపించడం లేదు. ఇది భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టే అంశం.

దేశంలో నానాటికీ మోదీపై అసంత్రప్తి పెరుగుతోంది. దీనికి కారణం దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం - ధరలు - అవినీతే అని ప్రజలు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం తొలగిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవానికి దేశంలో నిరుద్యోగం మాత్రం అంతకంతకు పెరుగుతోందని సర్వేలో ప్రజలు వెల్లడించారు. అధికారంలోకి రావడానికి ముందు ఏటా లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన ప్రధాని దాన్ని కార్యరూపంలోకి తీసుకురాలేదని ప్రజలు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఏర్పాటు చేయాలనుకుంటున్న మహాకూటమి ఆచరణలోకి వస్తే మాత్రం కమలనాథులకు ఇబ్బందులు తప్పవు. భారతీయ జనతా పార్టీని - ముఖ్యంగా నరేంద్ర మోదీని గద్దె దించేందుకు ఈ మహాకూటమి ప్రభావం చాలా ఉంటుందనేది సర్వే ద్వారా బహిర్గతమైంది. కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ - సమాజ్ వాదీ పార్టీ - బహుజన సమాజ్ పార్టీ - తెలుగుదేశం - డిఎంకె - వామపక్షాలు ఏకం అయితే మాత్రం భారతీయ జనతా పార్టీకి రానున్న ఎన్నికల్లో చుక్కుల కనిపించడం ఖాయంగానే కనిపిస్తోంది.