Begin typing your search above and press return to search.

కోవిడ్‌ను పంపింది కృష్ణుడే..హిందు దేవుడు కాబ‌ట్టే...

By:  Tupaki Desk   |   30 Jun 2020 1:30 AM GMT
కోవిడ్‌ను పంపింది కృష్ణుడే..హిందు దేవుడు కాబ‌ట్టే...
X
రాజ‌కీయ నాయ‌కుల్లో కొన్ని కామెడీ క్యారెక్ట‌ర్లు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నామ‌నే స్పృహ కూడా లేకుండా మాట్లాడేస్తుంటారు. ఇంకొంద‌రు వివాదాలు సృష్టించ‌డ‌మే ప‌నిగా పెట్టుకొని మాట్లాడేస్తుంటారు. ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్‌ దస్మానా రెండో కేట‌గిరీలో చేరుతారేమో. దేశ‌మంతా క‌రోనా క‌ల‌క‌లంతో స‌త‌మ‌తం అవుతుంటే ఆయ‌న దీన్ని మ‌తానికి ముడిపెట్టేశారు. కరోనా మహమ్మారిని శ్రీకృష్ణుడే పంపాడని కాంగ్రెస్‌ నేత సూర్యకాంత్‌ దస్మానా తేల్చేశారు. స‌హ‌జంగానే ఈ కామెంట్లు వివాదాన్ని రేకెత్తించాయి.

కరోనా వైరస్‌, కృష్ణ రెండూ ‘క’ శబ్ధంతో మొదలవుతాయని, అందుకే ఈ వైరస్‌ను శ్రీకృష్ణుడే మన వద్దకు పంపారని ఓ టీవీ చానెల్‌ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ సూర్యకాంత్ త‌న `విజ్ఞానాన్ని` చాటుకున్నారు. క‌రోనా వ్యాప్తి జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త వ‌హించాల‌ని కూడా ఆయ‌న ఓ ఉచిత స‌ల‌హా మ‌న మొహాన ప‌డేశారు. మ‌రోవైపు హిందూ దేవతలతో కోవిడ్‌-19ను పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత తీరుపై ట్విటర్‌లో నెటిజన్లు ఘాటుగా స్పందించారు.

ఇదిలాఉండ‌గా, దేశంలో రోజురోజుకు కొత్త‌గా న‌మోద‌య్యే క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రిక‌వ‌రీ అవుతున్న వారి సంఖ్య‌ కూడా స‌గ‌టున అంత‌కుమించే పెరుగుతుండ‌టంతో రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా మెరుగుప‌డుతున్న‌ది. సోమ‌వారం ఉద‌యానికి దేశ‌వ్యాప్తంగా 5,48,318 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, 3,21,723 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 2,10,120 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల కంటే రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 1,11,602 ఎక్కువ‌గా ఉండ‌టంతో దేశంలో రిక‌వ‌రీ రేటు మెరుగుప‌డి 58.67 శాతానికి చేరింది.