Begin typing your search above and press return to search.

ముంబైని నిలబెట్టేందుకే వచ్చాడు.. సూర్య

By:  Tupaki Desk   |   1 May 2022 10:38 AM GMT
ముంబైని నిలబెట్టేందుకే వచ్చాడు.. సూర్య
X
ప్రస్తుతం టీమిండియాలో అత్యంత నిలకడైన బ్యాట్స్ మెన్ ఎవరు..? పోనీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని స్వదేశీ బ్యాట్స్ మన్ లో నిలకడైనవారు ఎవరు..? విరాట్ కోహ్లినా..? రోహిత్ శర్మనా..? కానే కాదు.. ‘‘సూర్యకుమార్ యాదవ్’’. ఇటీవలి ఏడాది ప్రదర్శన చూస్తే ఇది వందశాతం నిజం అనిపిస్తుంది. తొలి బంతి నుంచే భీకరంగా విరుచుకుపడడం, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉండడం, అలవోకగా భారీ షాట్లు ఆడడం, మైదానం నలువైపులకూ బంతిని పంపగల సామర్థ్యం ఇవన్నీ సూర్య సొంతం. కోహ్లి, రోహిత్ ఒక్క అర్ధ శతకానికే ఇబ్బంది పడుతున్న ప్రస్తుత ఐపీఎల్ లీగ్ లో సూర్య మూడు బాదేశాడు. 8 మ్యాచ్ ల్లో మరో రెండుసార్లు 50కి దగ్గరగా పరుగులు చేశాడు. కోహ్లి, రోహిత్ దూకుడు తగ్గి.. టచ్ కోల్పోయినట్లు కనిపిస్తుండగా.. సూర్య మాత్రం చెలరేగి ఆడుతున్నాడు.

ముంబై గెలిచిందంటే అతడే..
ఈ సీజన్ లో ముంబై ఎట్టకేలకు శనివారం ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. వరుసగా 8పరాజయాల తర్వాత తొలి విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో గెలుపొంది కెప్టెన్ రోహిత్ శర్మకు సూపర్ డూపర్ బర్త్ డే గిఫ్ట్ అందజేసింది. కానీ ఈ విజయం అంతా ఈజీగా రాలేదు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158పరుగులు చేయగా.. ఛేదనకు దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తాకింది.

రోహిత్ శర్మ 2పరుగులకే ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ 26పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 46పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టు విజయతీరాలకు చేరడానికి మెయిన్ రీజన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఎంత ఓపికగా ఆడాదో.. ఎంత సొగసుగా బ్యాటింగ్ చేశాడో.. ఎంత సమన్వయంతో ముంబై అభిమానుల మనసు గెలిచాడో.. ఎంత చక్కగా తిలక్ వర్మతో కలిసి భాగస్వామ్యం నమోదు చేశాడో..! ఒక్క విజయం కోసం తహతహలాడుతున్న ముంబై జట్టుని, ముంబై అభిమానులకు తన హాఫ్ సెంచరీతో గెలుపురుచి చూపించాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు,
2 సిక్స్‌లతో 51పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. తిలక్ వర్మ(35పరుగులు)తో కలిసి 81పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. ముంబై గెలుపునకు గట్టి పునాది వేశాడు. తన ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

ఇదీ అతడి లెక్క...
52, 68, 43, 37, 32, 7 , 51 ఇవీ ఈ సీజన్ లో సూర్య కుమార్ 8 మ్యాచ్ ల్లో చేసిన పరుగులు. ఒక్కదాంట్లోనే అతడు విఫలమయ్యాడు. దీన్నిబట్టే సూర్య ఫామ్ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతోంది. వాస్తవానికి పొలార్డ్, ఇషాన్ కిషన్, రోహిత్ ఎవరూ ఫామ్ లో లేని ముంబై.. సూర్య లేకుంటే మరింత దారుణ స్థితిలో ఉండేది. చాలా మ్యాచ్ ల్లో కనీస పోరాటం అయినా ఇవ్వగలిగింది అంటే అది అతడి ప్రదర్శనతోనే. ఇక సూర్యకు మిడిలార్డర్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ నుంచి మంచి సహకారం అందుతోంది. శనివారం నాటి మ్యాచ్ లో తిలక్ అండగా నిలవడంతోనే సూర్య ముంబైని విజయపథంలో నిలిపాడు.

ఆల్ రౌండర్ నుంచి నిఖార్సయిన బ్యాట్స్ మన్ గా సూర్య కుమార్ యాదవ్ మంచి హిట్టర్. తొలి రంజీ మ్యాచ్ (2010-11) లోనే అతడు 73 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మూడో మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. తర్వాతి మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అయితే, కెరీర్ ప్రారంభంలో సూర్య మీడియం పేస్ వేసేవాడు.దీంతో అతడిని నిఖార్సయిన బ్యాట్స్ మన్ గా పరిగణించలేదు. ఆల్ రౌండర్ కోటాలోనే చూశారు. దీంతో అతడి ప్రతిభ వెలుగులోకి రాకుండా పోయింది. అయితే, ఆలస్యంగానైనా గుర్తించిన సెలెక్టర్లు.. సూర్యకు అవకాశాలిచ్చారు. తొలుత కోల్ కతా కు ఆడిన అతడు  2018 నుంచి ముంబైకి మారాడు. దీంతో సూర్య దశ తిరిగింది.

2018 సీజన్లో ముంబై తరఫున అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఆ సీజన్లో 512పరుగులు చేసిన సూర్య 4హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక 2019లోనూ పర్వాలేదనిపించిన సూర్య 2హాఫ్ సెంచరీలతో పాటు 424పరుగులు చేశాడు. 2020సీజన్లో 4హాఫ్ సెంచరీలతో 480పరుగులతో రాణించాడు. 2021సీజన్లో కాస్త తడబడ్డ సూర్య 2హాఫ్ సెంచరీలతో 317పరుగులు మాత్రమే చేశాడు. ఇక ప్రస్తుత సీజన్లో 7మ్యాచ్‌లు ఆడిన సూర్య 3హాఫ్ సెంచరీలతో 290పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ప్రతి సీజన్లో బ్యాటింగ్లో ముంబై జట్టుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు.

2018 నుంచి అత్యధిక అర్ధ సెంచరీలు అతడివే..
2018 నుంచి ఇప్పటివరకు ముంబై తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్య కొనసాగుతున్నాడు. 2018 సీజన్ నుంచి ముంబై తరఫున ఆడుతున్న ఈ ప్లేయర్ ఇప్పటివరకు 15 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఐపీఎల్ కెరీర్లో మొత్తం 16హాఫ్ సెంచరీలు చేసిన సూర్య.. అందులో 15ముంబై తరఫునే చేయడం గమనార్హం. మిగతా ఒకటి కోల్ కతా తరఫున చేశాడు. కోల్ కతా తరఫున లోయర్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసే సూర్యకుమార్ యాదవ్‌ను ముంబై యాజమాన్యం గుర్తించి 2018  కొనుగోలు చేసింది. పైగా అతని ఓపెనర్‌గా, మిడిలార్డర్లో బరిలో దించి అతని సత్తాను వినియోగించుకుంది.