Begin typing your search above and press return to search.

విరాట్ నన్ను స్లెడ్జ్‌ చేశాడు... సూర్యకుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   26 May 2021 3:30 AM GMT
విరాట్ నన్ను స్లెడ్జ్‌ చేశాడు... సూర్యకుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు !
X
సూర్యకుమార్‌ యాదవ్‌.. గత కొన్నేళ్లుగా పొట్టి ఫార్మాట్‌ లో ఇండియా తరపున అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్న యువ క్రికెటర్‌. ఐపీఎల్‌ లో ముంబై ఇండియన్స్‌ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యకుమార్ స్వదేశంలో ఇటీవల ఇంగ్లండ్‌ తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ లో అడుగుపెట్టాడు. ఆ సిరీస్ లో రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన సూర్య కుమార్ ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మరో అరంగేట్ర ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ పై టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సూర్యకుమార్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో నాలుగో టీ20 ద్వారా టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న సూర్య.. సిక్సర్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల ఖాతా తెరిచాడు.

అలాగే , తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ కొట్టిన ఐదో భారత క్రికెటర్‌ గా ఘనత సాధించాడు. అది అలా ఉంటే .. తనకెంతగానో గుర్తింపు తీసుకువచ్చిన ఐపీఎల్‌, ముఖ్యంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై జట్టు అంటే సూర్యకుమార్‌ కు ప్రత్యేక అభిమానం. ఇక గతేడాది సీజన్‌లో అద్భుతంగా రాణించిన సూర్య... రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌ లో జట్టును గెలిపించి.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ మధ్య జరిగిన ఘటన ఐపీఎల్‌ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో 13వ ఓవర్‌లో కోహ్లి బంతిని షైన్‌ చేస్తూ సూర్య వద్దకు వచ్చిన కోహ్లి దూకుడుగా వ్యవహరించాడు. అద్భుతమైన షాట్లు ఆడుతున్న అతడితో వాగ్వాదానికి సిద్ధమయ్యాడు. అయితే సూర్యకుమార్‌ ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ, కోహ్లికి దూరంగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన లైవ్‌ చాట్‌ లో ఈ ఘటన గురించి ప్రస్తావన రాగా సూర్యకుమార్‌ తనదైన శైలిలో స్పందించాడు. కోహ్లి మైదానంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉంటాడు. కేవలం నాతోనే కాదు, ఏ బ్యాట్స్‌ మెన్‌ తోనైనా అలాగే దూకుడుగా ఉంటాడు. నిజానికి తను నన్ను స్లెడ్జ్‌ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే, నేను బాగా ఆడితే మ్యాచ్‌ గెలుస్తామని తను భావించాడు. నా వికెట్‌ తీయాలని, తద్వారా గెలుపొందాలని వారి వ్యూహం. అంటే, నా బ్యాటింగ్‌ వల్ల వారికి ప్రమాదం పొంచి ఉందనే అర్థం కదా. అయితే ఇదంతా ఆట వరకే. నిజానికి కోహ్లి అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఘటన తర్వాత, మైదానం వెలుపల తను నాతో ఎంతో నార్మల్‌గా ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు.