Begin typing your search above and press return to search.

ఎస్పీ సార్‌.. మంత్రి `భ‌జ‌న‌` జ‌నం ఏమ‌నుకుంటారో కూడా ప‌ట్ట‌లేదే!

By:  Tupaki Desk   |   16 Sep 2022 2:18 PM GMT
ఎస్పీ సార్‌.. మంత్రి `భ‌జ‌న‌` జ‌నం ఏమ‌నుకుంటారో కూడా ప‌ట్ట‌లేదే!
X
రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శించారంటే.. ఒకింత అర్థం ఉంది. ఉంటుంది. పోనీ.. స్థానిక ఉద్యోగి ఎవ‌రో.. క‌క్కుర్తిప‌డి.. ఏదో నాయ‌కుల కొమ్ముకాశారంటే.. దానిని కూడా అర్థం చేసుకోవ‌చ్చు. కానీ, అఖిల భార‌త స‌ర్వీసు అధికారి.. జిల్లా మొత్తంపైనా ప‌ట్టున్న పోలీస్ బాస్ కూడా ఫ‌క్తు రాజ‌కీయ నేత‌గా మారిపోతే..!? కాదు.. కాదు.. మారిపోయాడు. ఫ‌క్తు నేత‌గానే ఆయ‌న మారిపోయాడు. మంత్రికి భ‌జ‌న చేశారు. ``జ‌య‌హో.. జ‌గ‌దీశ‌న్నా..`` అని స‌భా వేదిక‌గా.. రెచ్చిపోయారు. అంతేకాదు.. తాను రెచ్చిపోతూ.. స‌భికుల‌తోనూ.. రెచ్చిపోయేలా చేశారు.

ఆయ‌నే.. స‌ర్వ‌శ్రీ సూర్యాపేట జిల్లా పోలీసుల బాస్‌, సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌(ఎస్పీ) రాజేంద్ర ప్ర‌సాద్‌. తాజాగా తెలంగాణలో నిజాం ప్ర‌భువుల పాల‌న‌కు ముగింపు సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సూర్యాపేట‌లోనూ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనిలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. తొలుత ప్ర‌జానాయ‌కులు మాట్లాడారు. అనంత‌రం.. అక్క‌డ‌కు చేరుకున్న ఎస్పీ.. రాజేంద్ర‌ ప్ర‌సాద్ మైకు అందుకున్నారు. అంతే..పూన‌కం వ‌చ్చిన‌వాడిలా.. ఊగిపోయారు.

``జయహో జగదీశన్న`` నినాదంతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. తాను అన‌డ‌మే కాకుండా.. స‌భ‌లో ఉన్న‌వారంతా కూడా జ‌య‌హో జ‌గ‌దీశ‌న్న‌.. అనాల‌ని.. ఆయ‌న సూచించారు. దీంతో చేసేది లేక‌.. టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. ప్ర‌జ‌లు కూడా ఎస్పీ గారికి వంత‌పాడారు. అయితే.. ఎస్పీ వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన అధికారులు.. ఒక అధికార పార్టీ జెండా కింద పని చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డిని.. జయహో జగదీశ‌న్న‌ అని స్వయంగా పొగ‌డడం ఏంట‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

ఒక జిల్లాకు బాధ్య‌త వ‌హించే ఎస్పీ స్థాయి అధికారి.. ఇలా వ్య‌వ‌హ‌రించి.. ప్రజలకు త‌న కింది స్థాయి అధికారులకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నార‌ని అంటున్నారు. అంతేకాదు.. జిల్లా ఎస్పీకి టీఆర్ ఎస్‌ పార్టీ పైనా, మంత్రి పైనా ప్రేమ ఉంటే.. యూనిఫాం తీసేసి.. పార్టీలో చేరిపోవ‌చ్చుక‌దా? అనే విమ‌ర్శ‌లుకూడా వ‌స్తున్నాయి. నెటిజ‌న్లే ఇలా వ్యాఖ్యానిస్తుంటే.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఊరుకుంటాయా? చూడాలి ఎలా స్పందింస్తాయో.. అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. తెలంగాణ‌లో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌కు ఇది కొత్త‌కాద‌ని కొంద‌రు అంటున్నారు. ఒక జిల్లా కార్యాల‌యం ప్రారంభం సంద‌ర్భంగా సాక్షాత్తూ క‌లెక్ట‌రే.. సీఎం కేసీఆర్‌కు పాద‌న‌మ‌స్కారం పెట్టిన విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. ఇదీ.. సంగ‌తి!!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.