Begin typing your search above and press return to search.

మాజీ గవర్నరు కూతురికి సోషల్ మీడియా కష్టాలు

By:  Tupaki Desk   |   20 April 2017 2:05 PM GMT
మాజీ గవర్నరు కూతురికి సోషల్ మీడియా కష్టాలు
X
సోషల్ మీడియా విస్తరించాక ఏదీ గుట్టుగా ఉండడం లేదు. ఒక్కోసారి ఇది మేలు చేస్తుంటే ఒక్కోసారి ఎన్నో ఇబ్బందులను తెస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ‘ఫార్వర్డ్’ - షేర్ వంటి ఆప్షన్లు కొంప ముంచుతున్నాయి. ఫేస్ బుక్ లో కానీ, వాట్స్ యాప్ లో కానీ, ట్విట్టర్ కానీ, ఇన్ స్టాగ్రామ్ కానీ అందులో తమకు కనిపించినవి ఇట్టే షేర్ చేస్తున్నారు చాలామంది. అందులో ఏముంది.. నిజానిజాలేమిటి అనేది కనీసం చెక్ చేసుకోవడం లేదు. ఎవరైనా తెలియక పోస్టు చేసినా, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేసినా అవన్నీ క్షణాల్లో భూగోళమంతా పాకేస్తున్నాయి. ఇలాంటి ధోరణి వల్ల ఇప్పటికే వందలాది మంది ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నరు - మహారాష్ర్ట మాజీ సీఎం - మాజీ కేంద్ర హోం మంత్రి అయిన సుశీల్ కుమార్ షిండే కుమార్తె ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. ఆమె తప్పేమీ లేకపోయినా నిందారోపణలు ఎదుర్కొంటున్నారు.

సుశీల్ కుమార్ షిండే రెండో కుమార్తె ప్రీతి ష్రాఫ్ పై తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీని కంతటికి కారణం ఆమె ఇంటిపేరు ష్రాఫ్ అని ఉండడమే. గత సోమవారం పుణెలో ఫుట్ పాత్ పై నిల్చున్న వారిని ఓ మహిళ తన కారుతో ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆ యాక్సిడెంట్ కు పాల్పడిన మహిళ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య. ఆమె పేరు సుజాత జయప్రకాశ్ ష్రాఫ్. షిండే కూతురు ప్రీతి ఇంటి పేరు కూడా ‘ష్రాఫ్’ కావడంతో.. ఈ యాక్సిడెంటు ప్రీతి ష్రాఫ్ చేసినట్టుగా సామాజిక మాధ్యమాలు వేదికగా ఆమెపై తప్పుడు ప్రచారం జరిగింది.

దీంతో - ప్రీతి - ఆమె భర్త మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో, ఆమెపై తప్పుడు ప్రచారానికి నెటిజన్లు స్వస్తి పలికారు. కాగా, ప్రీతి ష్రాఫ్ భర్త అయిన రాజ్ ష్రాఫ్ కాంగ్రెస్ నేత, వ్యాపారవేత్త. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, అసలు విషయం తెలుసుకోకుండా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదని, నిజానిజాలు తెలుసుకోకుండా తమపై నిందలు వేయడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/