Begin typing your search above and press return to search.

తప్పు చేయలేదంటూనే..తాట తీసిన సుష్మా

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:35 PM GMT
తప్పు చేయలేదంటూనే..తాట తీసిన సుష్మా
X
దూకుడుగా.. ఎదుటివారిపై అధికారం ఉపయోగించి మాట్లాడటం ఒక పద్ధతి. అందుకు భిన్నంగా.. తనపై పడిన మచ్చను తుడుచుకుంటూ.. తనపై విమర్శలు చేసే వారి భాగోతాల్ని ఎండగట్టటం.. ఇందుకు చరిత్రను.. ఆధారాల్ని ఆయుధంగా చేసుకోవటం ఎలానో తాజాగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తన మాటల్లో చూపించారు.

లలిత్ గేట్ వ్యవహారంలో తన మీద వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చే పనిలో భాగంగా.. తనపై వచ్చిన ఒక్కో ఆరోఫణకు సమాధానం ఇస్తూనే.. కాంగ్రెస్ ద్వంద వైఖరిని.. గతంలో ఆ పార్టీ చేసి చారిత్రక తప్పుల్ని ఆధారాలతో సహా చదివి వినిపించి.. ఉక్కిరి బిక్కిరి చేశారు. అధికారపక్షాన్ని ఇరుకున పెడదామనుకున్న తమ వ్యూహానికి భిన్నంగా.. కాంగ్రెస్ నేతల నోట మాట రాని విధంగా సుష్మా తన వాదనను వినిపించిన క్రమంలో.. కాంగ్రెస్ నేతలు అసహనం హద్దులు దాటింది. ఎంతలా అంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సైతం.. వెల్ లోకి దూసుకుపోయేంతగా. ఇక.. సుష్మ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. ఆమె మాట్లాడనీయకుండా ఉండేందుకు ప్రయత్నించారు. తన వాదనతో కాంగ్రెస్ తాట తీసిన సుష్మ వాదనల్లోని ముఖ్యమైన అంశాల్ని చూస్తే..

తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. వాటిని వినేందుకు విపక్షం సిద్ధంగా లేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సుష్మా.. తాను ఎలాంటి తప్పులు చేయలేదని మరోసారి ఉద్ఘాటించారు.

మానవీయ కోణంలో ఒక మహిళకు తాను సాయం చేయటం తప్పా? అని అంటే.. తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నానని విఫక్షనేత వ్యాఖ్యానిస్తున్నారని.. లలిత్ మోడీకి ప్రయాణ పత్రాల్ని ఇవ్వటం తన పరిధిలోని అంశం కాదని చెప్పారు. లలిత్ మోడీ ప్రయాణానికి అనుమతి ఇవ్వటం ద్వారా.. బ్రిటన్ తో సంబంధాలు ఏమైనా ప్రభావం పడతాయా? అని అడిగితే.. పడవని మాత్రమే తాను చెప్పానన్నారు.

లలిత్ మోడీ కేసు విషయంలో తన భర్త లాయర్ కాదని.. తన కుమార్తె తొమ్మిదో లాయర్ మాత్రమేనని.. ఈ కేసుకు సంబంధించి తన కుమార్తె ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదన్నారు. అయినా.. న్యాయవాదుల టీంలోని తొమ్మిదో సభ్యురాలికి ఎవరైనా రెమ్యునరేషన్ ఇస్తారా? అని ప్రశ్నించారు.

యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరం ఉన్నప్పుడు.. ఆదాయపుపన్ను శాఖ తరఫున వకల్తా ఫైల్ చేశారని.. ఈ విషయాన్ని అన్నాడీఎంకే ప్రస్తావిస్తే.. ఆ విషయం తన దృష్టికి రాలేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన సుష్మ.. శారదా కుంభకోణంలో నిందితుల తరఫున నళిని చిదంబరం వాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదాయపన్ను శాఖ తరఫున చిదంబరం భార్య ఎలా వాదిస్తారని ప్రశ్నించిన ఆమె.. ఈ విషయం ఎవరికీ గుర్తు లేదా? అని ప్రశ్నించారు.

లలిత్ మోడీకి బ్రిటన్ లో ఉండే హక్కు ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారని.. మరి.. సోనియాకు భారత్ లో ఉండే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించిన ఆమె.. రాజీవ్ గాంధీ హయాంలో భోపాల్ గ్యాస్ లీకేజీ ఘటనలో అండర్స్ న్ ను రహస్యంగా ఎలా దేశాన్ని దాటించిందన్న విషయాన్ని ఆమె చదివి వినిపించారు. 15వేల మంది మృతికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఆదేశాలు ఇచ్చినప్పుడు.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన్ను ప్రశ్నించారని.. అండర్సన్ ను రాష్ట్ర విమానంలో ఢిల్లీ పంపించాలని రాజీవ్ ఆదేశించారని.. ఆయన్ను ఏ విధంగా దేశం దాటించింది చదివి వినిపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు.

రాహుల్ గాంధీకి సెలవులు తీసుకోవటం ఇష్టమని.. ఈసారి సెలవుల సమయంలో తమ కుటుంబ చరిత్ర తెలుసుకోవాలని సుష్మ ఎద్దేవా చేశారు. విదేశాల్లో లలిత్ ఉండేందుకు అవకాశం కల్పించింది ఎవరని ప్రశ్నించిన సుష్మ.. తప్పు కాంగ్రెస్ దగ్గర పెట్టుకొని తమను ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. లలిత్ కేసును నాలుగేళ్లు కాంగ్రెస్ నానబెట్టిందని.. నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ హయాంలో లలిత్ ను స్వదేశానికి తీసుకురాకుండా తమను ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ చెలరేగిపోయిన సుష్మ వాదనతో కాంగ్రెస్ బేజారెత్తిన పరిస్థితి.