Begin typing your search above and press return to search.

సుష్మా ల‌క్ష న‌జ‌రానా.. ఎందుకో తెలుసా

By:  Tupaki Desk   |   2 Oct 2017 4:31 AM GMT
సుష్మా ల‌క్ష న‌జ‌రానా.. ఎందుకో తెలుసా
X
విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ దేశ ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా గిఫ్ట్ ప్ర‌క‌టించారు. రూ.ల‌క్ష ఇస్తాన‌ని ట్వీట్ చేశారు. అయితే, ఈ బ‌హుమానం పొందేందుకుగాను 2015 అక్టోబరులో పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన గీత తల్లిదండ్రులను గుర్తించాల‌ని సుష్మా కోరారు. నిజానికి విదేశాంగ మంత్రిగా చాలా వేగంగా స్పందిస్తూ.. బాధితుల‌కు భ‌రోసా ఇస్తున్నారు సుష్మా. ఈ క్ర‌మంలోనే గీత‌ను పాక్ నుంచి భార‌త్‌ కు ర‌ప్పించ‌డంలో విశేషంగా కృషి చేశారు. పుట్టుక‌తోనే చెముడు - మూగ బాధితురాలైన గీత అనూహ్యంగా పాక్‌ కి వెళ్లిపోయింది. అయితే, ఆమె భార‌త్‌ లోని బిహార్ లేదా జార్ఖండ్ చెందిన యువ‌తి కావ‌డంతో ఆమె విజ్ఞ‌ప్తి మేర‌కు సుష్మా గీత‌ను భార‌త్‌ కు ర‌ప్పించారు.

అయితే, గీత భార‌త్‌ కు చేరి దాదాపు రెండేళ్లు పూర్త‌యినా.. ఆమె కుటుంబం - త‌ల్లిదండ్రుల వివ‌రాల‌ను ఇప్ప‌టికీ గీత చెప్ప‌లేక‌పోతోంది. దీంతో సుష్మా ఇప్ప‌టికే ప‌లు మార్లు దేశ ప్ర‌జ‌ల‌కు గీతను గుర్తించండి అని విజ్ఞ‌ప్తి చేశారు. అయినా ఎలాంటి ఫ‌లిత‌మూ క‌నిపించ‌లేదు. ఇదిలావుంటే, గీత పాకిస్థాన్‌ లో ఉన్న స‌మ‌యంలో ఎధి ఫౌండేష‌న్ ఎంతో సాయం చేసింది. అంతేకాదు - గీత‌ను భార‌త్‌ కు తీసుకువ‌చ్చే క్ర‌మంలో ఈ ఫౌండేష‌న్ ఇటు ప్ర‌భుత్వానికి - అటు గీత‌కు మ‌ధ్య వార‌ధిలా ప‌నిచేసింది. గీత పదకొండేళ్ళ వయసులో తప్పిపోయి పాకిస్థాన్‌ చేరుకుంది. అక్కడ 13 ఏళ్ళపాటు ఉంది. ఆమెను మొదట లాహోర్‌ లోని బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు.

ఆ తర్వాత ఎధి ఫౌండేషన్ కాపాడి, సంరక్షించింది. అక్కడ ఆమెకు ఫాతిమా అని పేరు పెట్టారు. ఇక‌, ఇప్పుడు యుక్త వ‌య‌సు రావ‌డంతో గీత‌ను ఆమె త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించాల‌ని ఫౌండేష‌న్ ప‌దే ప‌దే మంత్రి సుష్మాకు విజ్ఞ‌ప్తి చేసింది. దీంతో గీత తల్లిదండ్రులను గుర్తించడంలో సహకరించినవారికి రూ. లక్ష బహుమతి ఇస్తామని మంత్రి తాజాగా ప్రకటించారు. గీత భార‌త పౌరురాల‌ని - ఆమెకు స‌హాయ ప‌డాల‌ని త‌న ట్విట్ట‌ర్‌ లో సుష్మా విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌స్తుతం గీత కేంద్ర సంర‌క్ష‌ణా నిల‌యంలో ఉంటూ చ‌దువుతోపాటు చేతి వృత్తిని నేర్చుకుంటోంది. మ‌రి ఈమె త‌ల్లిదండ్రుల ఆచూకీ ఎప్ప‌టికి లభిస్తుందో చూడాలి.