Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌ను పాకిస్థానీ సాయం అడిగితే..?

By:  Tupaki Desk   |   1 Jun 2017 11:59 AM GMT
చిన్న‌మ్మ‌ను పాకిస్థానీ సాయం అడిగితే..?
X
స‌మ‌స్య‌లో నిజాయితీ ఉండి.. తీవ్ర‌త ఎలాంటిదైనా స‌రే.. వెనుకా ముందు ఆలోచించ‌కుండా ఓకే అనేయ‌టం.. ఆ స‌మ‌స్యు స‌రైన ప‌రిష్కారం ల‌భించే వ‌ర‌కూ త‌న సొంత స‌మ‌స్య‌లా త‌పించ‌టం కేంద్ర‌మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ లో క‌నిపిస్తుంది.

కేంద్ర విదేశాంగ మంత్రిగా మోడీ మంత్రివ‌ర్గంలో ప‌ని చేస్తున్న ఆమె.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎంతో మందికి సాయాలు చేస్తూనే ఉన్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా.. ఆమె దృష్టికి తీసుకొచ్చే స‌మంజ‌స‌మైన అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దిశ‌గా ప్ర‌య‌త్నించారు సుష్మా.

మొన్న‌టికి మొన్న పాకిస్థానీ చేతిలో దారుణంగా మోస‌పోయిన మ‌న‌మ్మాయి ఉజ్మాను ఇండియాకు తిరిగి తీసుకొచ్చేందుకు ఆమె చేసిన ప్ర‌య‌త్నాన్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. ఇలాంటి వేళ‌.. అనుకోని రీతిలో సుష్మా సాయాన్ని కోరారు ఒక పాకిస్థానీ.

ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య‌నున్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో సుష్మ‌ను సాయం ఆడిగితే ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా లాహోర్‌ కు చెందిన ఒక సివిల్ ఇంజినీర్ త‌న నెల‌ల ప‌సికందుకు తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న నేప‌థ్యంలో త‌న బిడ్డ‌కు మెరుగైన చికిత్స కోసం భార‌త్ రావాల‌నుకుంటున్నాడు.

అదే విష‌యాన్ని సుష్మ ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ.. సుష్మా మేడ‌మ్‌.. భార‌త్ పాక్ ల ఘ‌ర్ష‌ణ‌ల కార‌ణంగా నా బిడ్డ ఎందుకు బాధ ప‌డాలి? అని ప్ర‌శ్నించారు. త‌న ప‌సికందుకు భార‌త్ లో చికిత్స చేయించ‌టానికి వీసా వ‌చ్చేలా సాయం చేయాల‌ని కోరారు.

ఎప్ప‌టిలానే ఈ అభ్య‌ర్థ‌న‌కు సైతం వెనువెంట‌నే స్పందించిన సుష్మా.. లేదు..నీ బిడ్డ‌కు ఎలాంటి క‌ష్టం రాదు.. మీరు ముందు పాక్ హైక‌మిష‌న్ ను సంప్ర‌దించండి.. ఆ త‌ర్వాత మెడిక‌ల్ వీసా వ‌చ్చేలా చేస్తామంటూ హామీ ఇచ్చారు. ప‌రాయి దేశం వీసా ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. స‌ద‌రు పాకిస్థానీకి సొంత దేశం ఎంత త్వ‌ర‌గా రియాక్ట్ అవుతుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/