Begin typing your search above and press return to search.

జాద‌వ్ ఘ‌ట‌న‌...రాజ్య‌స‌భ‌లో సుష్మా క‌న్నీరు!

By:  Tupaki Desk   |   28 Dec 2017 11:36 AM GMT
జాద‌వ్ ఘ‌ట‌న‌...రాజ్య‌స‌భ‌లో సుష్మా క‌న్నీరు!
X
దాయాది దేశం పాకిస్థాన్ మ‌రోసారి త‌న కుటిల - నీచ‌ బుద్ధిని బ‌య‌ట‌పెట్టిన సంగతి తెలిసిందే. దౌత్య‌ప‌ర‌మైన విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి పాక్ కు చెందిన రోగుల‌కు భార‌త్ లో వైద్యం చేయించుకునేందుకు మాన‌వ‌త్వంతో వీసాల‌ను మంజూరు చేస్తున్నామ‌న్న సంగ‌తిని కూడా మ‌రచి మూర్ఖంగా ప్ర‌వ‌ర్తించింది. గూఢచర్యం కేసులో మరణశిక్ష పడి - ప్రస్తుతం పాకిస్తాన్‌ లోని జైలులో మగ్గిపోతున్న కుల్‌ భూషణ్ జాదవ్‌ ను క‌లిసేందుకు వెళ్లిన అత‌డి త‌ల్లి - భార్య‌ల‌ను పాక్ అవ‌మానించిన తీరుపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ నేప‌థ్యంలో పాక్ తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు. జాద‌వ్ త‌ల్లి - భార్య‌ల ప‌ట్ల పాక్ వ్య‌వ‌హ‌రించిన తీరును అత్యంత హేయ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. పాక్ అధికారులు ఒప్పందానికి విరుద్ధంగా ప్రవర్తించార‌ని - జాదవ్ తల్లి - భార్యల మెడలోంచి తాళి - చేతికున్న గాజులు - చివరికి నుదుట‌ ఉన్న బొట్టు కూడా తీయించ‌డం సిగ్గుచేట‌న్నారు. జాద‌వ్ కు వారిని విధవలుగా చూపించార‌ని రాజ్యసభలో సుష్మా కంటతడి పెట్టారు. ఆ పరిస్థితుల్లో తల్లిని చూసిన జాద‌వ్ ...త‌న తండ్రికి ఏమైనా అయిందేమో అని కంగారు ప‌డ్డారన్నారు. ఇంత‌టి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డింది కాక‌ - మానవత్వం చాటుకున్నామని చెప్ప‌డం సిగ్గుచేట‌న్నారు. ఆఖ‌రికి జాద‌వ్ తల్లిని మరాఠీలో మాట్లాడనివ్వ‌లేద‌ని, ఇంగ్లీషు లేదా హిందీలో మాట్లాడ‌క‌పోతే ఇంట‌ర్ ఫోన్ క‌ట్ చేశార‌ని తెలిపారు.

జాదవ్ కుటుంబ సభ్యుల ప్రాథ‌మిక‌ హక్కులను పాక్ కాల‌రాసింద‌ని సుష్మా స్వరాజ్ మండిప‌డ్డారు. ఆఖ‌రికి జాదవ్‌ భార్య చెప్పులలో కెమెరాలు - రికార్డింగ్ చిప్ లున్నాయ‌నే అనుమానంతో తీసుకున్నార‌ని, వాటిని తిరిగివ్వలేదని చెప్పారు. ఆ చెప్పులతో ఆమె రెండు విమానాల్లో ప్రయాణించారని, ఏమ‌న్నా ఉంటే అక్క‌డే తెలిసిపోయేద‌న్నారు. కావాల‌నే ఆమెను అవ‌మానించింద‌న్నారు. భారత్ మనోభావాలను పాక్ దెబ్బతీసిందన్నారు. జాదవ్‌ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానంలో స్టే తీసుకురాగలిగామని, త్వ‌ర‌లోనే అత‌డు బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని, అతడిని విడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామ‌ని చెప్పారు. జాద‌వ్ పై పాక్ తీరును కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్ తీవ్రంగా ఖండించారు. సుష్మా వ్యాఖ్య‌ల‌కు ఆజాద్ మ‌ద్ద‌తు ప‌లికారు. జాదవ్‌ భార్య - తల్లిని పాక్‌ అవమానించ‌లేద‌ని - మొత్తం భారతీయులనే అవమానించింద‌ని మండిప‌డ్డారు. ఇటువంటి ఘ‌ట‌న‌ల‌లో రాజకీయ విభేదాలు ప‌క్క‌న‌బెట్టి అంతా ఏక‌మై పోరాడాల‌ని పిలుపునిచ్చారు. మన తల్లులు - సోదరీమణుల పట్ల దాయాది దేశం అమాన‌వీయంగా - చెడుగా ప్రవర్తిస్తే చూస్తూ సహించమ‌న్నారు.