Begin typing your search above and press return to search.

సోనియా ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానంటూ సవాల్

By:  Tupaki Desk   |   7 Aug 2019 4:30 AM GMT
సోనియా ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానంటూ సవాల్
X
సుష్మా స్వరాజ్ పేరు విన్నంతనే చిన్నమ్మ మాట గుర్తుకు వస్తుంది. తన మాటలతో.. చేతలతో అందరి మనసుల్ని దోచుకునే ఆమె.. కొన్ని విషయాల్లో చాలా నిక్కచ్చిగా.. కచ్ఛితంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడని తత్త్వం ఆమె సొంతం. సోషల్ మీడియాతో ఇమేజ్ బిల్డింగ్ ఎలా సాధ్యమన్న విషయాన్ని సుష్మను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలానికి.. అభిరుచికి తగ్గట్లుగా మారటం.. టెక్నాలజీతో ప్రజలకు చేరువ ఎలా కావొచ్చన్న విషయాన్ని సుష్మను చూసి నేర్చుకోవాల్సింది.

జాతీయవాదాన్ని బలంగా వినిపించే సుష్మ.. కొన్ని విషయాల్లో చాలా నిర్దిష్టంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గరు. ఒక విదేశీ మహిళ భారత దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించటాన్ని తాను ఒప్పుకోలేనని తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు.. ఆమె నోట అనూహ్యమైన సవాల్ వచ్చింది. ఇప్పుడంటే సోనియాగాంధీ బలహీనమైన నాయకురాలుగా ఉన్నారు కానీ.. 200414 వరకు దేశ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటివేళ.. సుష్మా స్వరాజ్ విసిరిన సవాల్ ను నేటికి పలువురు గుర్తుకు తెచ్చుకుంటారు. సోనియాగాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపడితే తాను శిరోముండనం (గుండు) చేయించుకొని సన్యాసి జీవితాన్ని గడుపుతానని.. కుటీరానికి వెళ్లిపోతానని ప్రకటించి సంచలనం సృష్టించారు. 1999లో సోనియాగాంధీ కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగినప్పుడు సుష్మా ఆమెపై పోటీకి దిగారు. భారీ ఎత్తున పోటీ ఇచ్చినా.. నాటి పరిస్థితుల్లో సోనియా గాంధీ సదరు ఎన్నికల్లో గెలిచారు. కానీ.. సుష్మ ఇచ్చిన పోటీతో దేశ ప్రజల మనసుల్ని దోచారని చెప్పక తప్పదు.