Begin typing your search above and press return to search.

పాక్ పై డైరెక్ట్ అటాక్ కు దిగేసిన సుష్మా

By:  Tupaki Desk   |   24 July 2016 5:09 AM GMT
పాక్ పై డైరెక్ట్ అటాక్ కు దిగేసిన సుష్మా
X
మొహమాటపు పరదాలు దాదాపుగా తొలిగిపోయినట్లే. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనట్లుగా భారత్.. పాక్ ల మద్య మాటల సంవాదం నడుస్తోంది. కశ్మీర్ పై గతంలో మాదిరి ఆచితూచి మాట్లాడే విధానాన్ని కట్టిపారేయటమే కాదు.. పాక్ అక్రమిత కశ్మీర్ ను ఎప్పుడు విడిచిపెడతారంటూ నేరుగా అడిగేసే వరకూ విషయం వెళ్లటం తెలిసిందే. భారత్ నుంచి ఈ తరహా పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని పాక్ ఇప్పుడు పెడసరంగా మాట్లాడుతున్న పరిస్థితి.

అక్రమిత కశ్మీర్ ను పాకిస్థాన్ వదిలి వెళ్లాలంటూ భారత్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా అన్నట్లు.. కశ్మీర్ పాక్ లో కలిసే రోజు కోసం తాను ఎదురుచూస్తున్నట్లుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ నేరుగా స్పందించారు. ఆచితూచి మాట్లాడే విధానానికి కట్టిబెట్టి.. పాక్ కల ఎప్పటికి సాకారంకాదన్న ఆమె.. జమ్మూకశ్మీర్ ముమ్మాటికి భారత్ లో భాగమని తేల్చేశారు.

పాక్ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ను ఆశీర్వదించటం తర్వాత సంగతి.. ఉగ్రవాదులతో నింపేస్తుందని.. హింసతో అలజడులు సృష్టించాలని చూస్తుందని వ్యాఖ్యానించారు. పాక్ ఎన్ని ఎత్తులు వేసినా.. జమ్ముకశ్మీర్ లో వారి పప్పులు ఉడకవని తేల్చిన సుష్మా మాటలు పాక్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా ఉన్నాయని చెప్పాలి.