Begin typing your search above and press return to search.

సుష్మ మాన‌వ‌త్వానికి పాకిస్థానీల ఫిదా!

By:  Tupaki Desk   |   27 Sep 2017 12:15 PM GMT
సుష్మ మాన‌వ‌త్వానికి పాకిస్థానీల ఫిదా!
X
కొంతకాలంగా భార‌త్‌ - పాకిస్థాన్ ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. నిత్యం స‌రిహ‌ద్దు వ‌ద్ద దాయాది దేశం క‌య్యానికి కాలు దువ్వుతూ భార‌త సైనికులను రెచ్చ‌గొడుతుండ‌డంతో ఇరు దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వైద్యం కోసం భార‌త్ కు రావాల‌నుకుంటున్న పాకిస్థానీల‌కు వీసాలు దొర‌క‌డం గ‌గ‌న‌మైంది. అయితే, దాయాది దేశానికి చెందిన రోగుల పాలిట కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అప‌ద్భంధువులా మారారు. మాన‌వ‌త్వంతో వారికి వీసాలు మంజూరు చేసి వారికి ఆప‌న్న హ‌స్త‌మందిస్తున్నారు. గ‌తంలో ఓ పాకిస్థాన్ చిన్నారి ఆప‌రేష‌న్ కోసం అత‌డి త‌ల్లిదండ్రుల‌కు - కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ మ‌రో మహిళ‌కు వీసా ఇప్పించి సుష్మ మాన‌వ‌త్వానికి ఎల్ల‌లు లేవ‌ని నిరూపించారు. తాజాగా మ‌రోసారి సుష్మ త‌న ద‌యాగుణాన్ని చాటుకున్నారు. గుండె వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారికి వీసా మంజూరు చేసి ఆ కుటుంబానికి కొండంత సాయం చేశారు.

పాకిస్తాన్‌ కు చెందిన నిదా షోయ‌బ్‌ ఏడేళ్ల కూతురు మహా సోహైల్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఢిల్లీలోని నోయిడాలో ఉన్న జేపీ ఆస్పత్రిలో ఆ చిన్నారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే, ఆ చిన్నారికి, ఆమె త‌ల్లిదండ్రుల‌కు భారత్‌ కు వచ్చేందుకు వీసా మంజూరులో జాప్యం జ‌రుగుతోంది. దీంతో, సుష్మ‌కు షోయ‌బ్ ట్విట్ట‌ర్ ద్వారా త‌మ‌కు వీసా మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. వీసా కోసం ఆగస్టు నుంచి ఎదురు చూస్తున్నామని, ఇప్పటికే ఆలస్యమైపోయిందని చెప్పింది. సోహైల్ పరిస్థితి రోజురోజుకీ దిగ‌జారుతోంద‌ని, తన కూతురిని మీరే కాపాడాలంటూ సుష్మ‌కు ట్వీట్ చేసింది. షోయ‌బ్ విజ్ఞప్తికి వెంట‌నే స్పందించిన సుష్మా స్వరాజ్ ఆ చిన్నారికి వీసా మంజూరు చేస్తామని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు, సోహైల్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు కూడా ట్వీట్ చేశారు. త‌న ద‌యాగుణాన్ని మ‌రోసారి చాటుకున్న‌ సుష్మా స్వరాజ్ పై నెటిజన్లు ప్రశంసల జ‌ల్లు కురిపిస్తున్నారు. గ‌తంలో కూడా కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌కు భార‌త్ లో శ‌స్త్ర చికిత్స కోసం సుష్మ వీసా మంజూరు చేశారు. దీంతో, ఆ మ‌హిళ సుష్మ‌కు ఫిదా అయిపోయింది. సుష్మ త‌మ దేశ ప్ర‌ధాని అయితే ఎంత బాగుంటుందో అంటూ ట్వీట్ చేసింది.