Begin typing your search above and press return to search.
జీఈఎస్ సాక్షిగా..కేసీఆర్ కు సుష్మా ఝలక్
By: Tupaki Desk | 28 Nov 2017 4:37 PM GMTహైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరుగుతున్న జీఈఎస్ సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. జీఈఎస్ సదస్సుకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెపుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు గతం గుర్తు చేశారని అంటున్నారు. జీఈఎస్ సదస్సుకు హాజరైన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అభినందనలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. స్కిల్ డెవెలప్ మెంట్ ద్వారా మహిళలు తమ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటున్నారన్నారు. భారత మహిళా పారిశ్రామిక వేత్తలు ప్రపంచ వ్యాప్తంగా తమ శక్తి సామర్థ్యాలు చాటుతున్నారని సుష్మాస్వరాజ్ తెలిపారు.
ప్రధాని మోడీ - ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ప్రపంచ శాంతి - సౌభ్రాతృత్వం నెలకొనడంతో పాటు ఇండియా-యూఎస్ సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయన్నారు. సాంప్రదాయ - ఆధునీకరణ పరిపూర్ణ మేళవింపు హైదరాబాద్ అని అన్నారు. తనకు ఇక్కడి సంస్కృతి సుపరిచితమని...తనను అందరూ తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా సభలో చప్పట్లు వినిపించాయి.
తెలంగాణ ఉద్యమం సమయంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లోక్ సభలో సుష్మాస్వరాజ్ విభజన బిల్లుకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ తరఫున రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందేందుకు సుష్మా పెద్ద ఎత్తున కృషిచేశారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆమెను తెలంగాణ చిన్నమ్మగా ప్రకటించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె కృషిని టీఆర్ ఎస్ లైట్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సభా వేదికగా సీఎం కేసీఆర్ కు తన పాత్ర ఏంటో సుష్మాస్వరాజ్ గుర్తు చేసిందని అంటున్నారు.
కాగా, గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు - కుమార్తె ఇవాంకా ట్రంప్ తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ మెట్రో రైలు ప్రారంభోత్సవం తర్వాత నేరుగా హెచ్ ఐసీసీకి వెళ్లిన మోడీ.. మొదట ఇవాంకాతో సమావేశమయ్యారు. ఇవాంకా, మోడీతోపాటు రెండు దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాంకా అంతకుముందు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తోనూ భేటీ అయ్యారు.