Begin typing your search above and press return to search.

కేంద్ర‌మంత్రి సంచ‌ల‌నం..ఇక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను

By:  Tupaki Desk   |   20 Nov 2018 2:44 PM GMT
కేంద్ర‌మంత్రి సంచ‌ల‌నం..ఇక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను
X
సుదీర్ఘ రాజ‌కీయవేత్త‌గా, స్వ‌దేశీ విధానాల‌కు పెద్ద‌పీట వేసే పార్టీ నాయ‌కురాలిగా ఉన్న‌ప్ప‌టికీ, సోష‌ల్ మీడియాలో చురుకుగా స్పందిస్తూ స‌మ‌స్య‌ల విష‌యంలో గొప్ప మాన‌తవ‌త్వంతో వ్య‌వ‌హ‌రించే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, భార‌తీయ జ‌న‌తాపార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు సుష్‌మాస్వ‌రాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌ అనుభవమున్న సుష్మా స్వరాజ్య వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని మీడియా సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలా.. వద్దా.. అనేది పార్టీ నిర్ణయిస్తుందని కానీ, ఆరోగ్య పరమైన కారణాల వలన పోటీ చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆమె తన ఆరోగ్య కారణాల వల్ల ఎన్నికల బరి నుంచి వైదొలగుతున్నట్టు స్పష్టం చేశారు. 66 సంవత్సరాల వయసున్న సుష్మా స్వరాజ్‌ ఆరోగ్య కారణాలతో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా సుష్మా స్వరాజ్‌కు రెండేళ్ల కిందట ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. సుష్మాస్వరాజ్ మోడీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం సుష్మా విదిషా లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుష్మా స్వరాజ్ మధ్యప్రదేశ్ లోని విదిశా లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ సీటు నుంచి వరుసగా రెండో సారి ఆమె ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎన్డీయే కేబినెట్ లో విదేశాంగశాఖామంత్రిగా పనిచేస్తున్న సుష్మా స్వరాజ్ నిర్ణయం బీజేపీలో సంచలన నిర్ణయమనే చెప్పవచ్చు.

భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితుల‌య్యారు.