Begin typing your search above and press return to search.

మ‌రోసారి పెద్ద మ‌నుసు చాటిన చిన్న‌మ్మ

By:  Tupaki Desk   |   29 Aug 2017 5:22 PM GMT
మ‌రోసారి పెద్ద మ‌నుసు చాటిన చిన్న‌మ్మ
X
క‌ష్టంలో ఉన్న వారికి చేత‌నైనంత సాయం చేసే వారు కొద్దిమంది ఉంటారు. రాజ‌కీయ నేత‌ల్లో ఈ త‌ర‌హా చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తుంది. ముక్కుముఖం తెలీకున్నా.. క‌ష్టంలో ఉన్నామంటూ ట్వీట్ చేస్తే చాలు.. వెంట‌నే రియాక్ట్ కావ‌టం కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు అల‌వాటు. ఇప్ప‌టికే ఎంతో మందికి ఎన్నో ర‌కాలుగా సాయం చేసే ఆమె.. త‌న సాయాన్ని ఎల్ల‌లు దాటించారు కూడా.

నిత్యం భార‌త్ లో క‌ల్లోలాన్ని రేపేందుకు దుష్ట ఎత్తులు వేసే దాయాది పాక్ కు చెందిన అమాయ‌క ప్ర‌జ‌లు ఎవ‌రైనా క‌ష్టంలో ఉన్నాం.. సాయం చేయండ‌న్న మాట నోటి నుంచి వ‌చ్చిన వెంట‌నే వెనుకా ముందు ఆలోచించ‌కుండా వారికి సాయంగా నిలిచేందుకు త‌న వంతు సాయాన్ని పూర్తి స్థాయిలో చేసే సుష్మ తీరును ఇప్ప‌టికే ప‌లువురు పాకిస్థానీలు అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. సుష్మ లాంటి వారు త‌మ దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తే ఎంత బాగుండేద‌న్న మాట‌ను కూడా ప‌లువురు ప్ర‌స్తావించ‌టం కూడా క‌నిపిస్తుంది.

తాజాగా త‌న ఉదార‌త‌ను మ‌రోసారి చాటుకున్నారు సుష్మా. పాక్ కు చెందిన రోగులు ఎవ‌రైనా మెడిక‌ల్ వీసాలు ఇవ్వ‌టానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్న మాట‌కు సుష్మ కట్టుబ‌డ్డారు. అప‌స్మార‌క‌స్థితిలో ఉన్న ఓ పాక్ చిన్నారికి మెడిక‌ల్ వీసాను మంజూరు చేసిన ఆమె త‌న ఉదార‌త‌ను చాటుకున్న ఉదంతం ప‌లువురు పాకిస్థానీయుల మ‌న‌సుల్ని దోచుకుంటోంది.

బ‌లూచిస్థాన్‌లోకి క్వెట్టాకు చెందిన ఇర్ఫాన్ షా.. స‌య్యిద్ సైఫ్ ఉల్లాలు త‌మ బిడ్డ కోసం సాయం అందించాలంటూ సుష్మ‌కు ట్వీట్ చేశారు. అప‌స్మార‌క స్థితికి చేరిన తమ చిన్నారికి సాయం చేయాల‌న్నారు. దీనిపై స్పందించిన ఆమె.. భార‌త్ లో చికిత్స కోసం మెడిక‌ల్ వీసాను మంజూరు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎంతైనా చిన్న‌మ్మ చిన్న‌మ్మే.