Begin typing your search above and press return to search.

పాక్ యూత్ మనసు దోచుకున్న ‘చిన్నమ్మ’

By:  Tupaki Desk   |   4 Oct 2016 10:18 AM GMT
పాక్ యూత్ మనసు దోచుకున్న ‘చిన్నమ్మ’
X
సోషల్ మీడియాతో ఇమేజ్ ను ఎంతలా పెంచుకోవాలో కొంతమందికి చాలా బాగా తెలుసు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో వెలిగిపోయే ప్రముఖులు కొందరైతే.. సోషల్ మీడియాతో ప్రజలకు సాయంగా నిలిచేందుకు దాన్నో శక్తివంతమైన ఆయుధంగా వాడుకోవటం మరికొంత మందికి తెలుసు. అలా తెలిసిన వారిలో మోడీ మంత్రివర్గంలోని సీనియర్ కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్.. సురేశ్ ప్రభులు ముందుంటారు. తమ శాఖల్ని ప్రజలకు సోషల్ మీడియాతో నేరుగా అనుసంధానం చేసిన ఘనత వారికే దక్కుతుంది.

సోషల్ మీడియాలోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసే అంశాలపై వెనువెంటనే స్పందించటమేకాదు.. వారికి అవసరమైన సాయాన్ని అందిస్తూ ప్రజల మనసుల్ని దోచుకునే సుష్మా స్వరాజ్.. తాజాగా పాక్ యూత్ మనసుల్నికూడా దోచుకున్నారు. ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఎంతటి ఉద్రిక్త వాతావరణం నెలకొందన్న విషయం తెలిసిందే. దీంతో..ఇరుదేశాల ప్రజల్లో తీవ్ర భావోద్వేగం నెలకొని ఉంది. ఇలాంటి సమయంలోనూ.. ఆమె చేసిన ఒక పని పాక్ యూత్ మనసుల్ని దోచుకోవటమే కాదు.. భారత్ వ్యవహరించే తీరు అందరికి అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి.

చండీగఢ్ లో జరిగిన గ్లోబల్ యూత్ పీస్ ఫెస్టివల్ కు పాక్ నుంచి 19 మంది యువతులతో కూడిన బృందం ఒకటి వచ్చింది. వారి షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 4న పాకిస్థాన్ కు వెళ్లాల్సి ఉంది. అయితే.. వారు వచ్చిన తర్వాత అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు.. భారత్ జరిపిన సర్జికల్ దాడిలాంటి వ్యవహారాలతో వారి తిరుగు ప్రయాణంపై సస్పెన్స్ నెలకొంది.

ఊహించని విధంగా చోటు చేసుకున్న పరిణామాలతో వారు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్రమంత్రి సుష్మా వెంటనే స్పందించటమే కాదు.. వారికి భారత అధికారులతో అదనపు భద్రతను సమకూర్చటంతో పాటు.. అక్టోబరు 1న వారంతా పాకిస్థాన్ కు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. దీంతో.. వారు క్షేమంగా పాక్ కు వెళ్లిపోయారు.అనంతరం ఈ బృందానికి చెందిన అలియా హరీర్ తాజాగా ట్విట్టర్ లో సుష్మను పొగిడేస్తూ ట్వీట్ చేశారు.

భారతీయులు తమ అతిథులను దేవుళ్లలా చూస్తారంటూ ఆమె వ్యాఖ్యానించారు. అందరూ అప్యాయంగా చిన్నమ్మగా పిలుచుకునే సుష్మను సదరు పాకిస్థానీ అమ్మాయి మరోసారి పొగిడేస్తూ.. ఆమె సహాయానికి థ్యాంక్స్ చె ప్పారు. దీనికి స్పందించిన సుష్మా.. ‘‘ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లలేగా’’అంటూ తన వ్యాఖ్యను పోస్ట్ చేశారు. తన మాటలతో.. చేతలతో దేశీయుల మనసుల్నే కాదు.. చిన్నమ్మ ఈసారి పాక్ యూత్ మనసుల్నిదోచుకున్నారనటంలో సందేహం లేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/