Begin typing your search above and press return to search.

పాత చింతకాయ పచ్చడంటూ తేల్చి చెప్పారు

By:  Tupaki Desk   |   3 Oct 2015 4:17 AM GMT
పాత చింతకాయ పచ్చడంటూ తేల్చి చెప్పారు
X
ఆచితూచి మాట్లాడటం.. మనసులోని మాటను చెప్పేందుకు బెరుకు.. భయం.. మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరించే ధోరణికి భారత్ నీళ్లు వదిలేసినట్లుంది. అంతర్జాతీయ వేదికల మీద కొన్ని దశాబ్దాలుగా అనుసరించే ధోరణికి భిన్నంగా మోడీ సర్కారు గళం విప్పుతోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సభ్యులను ఉద్దేశించి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తాజాగా చేసిన ప్రసంగమే దీనికి నిదర్శనం.

భద్రతామండలిలో తనతో పాటు.. మరో మూడు దేశాలకు శాశ్విత సభ్యత్వం ఇవ్వాలంటూ ప్రధాని మోడీ చేసిన ప్రసంగానికి కొనసాగింపుగా సుష్మా ప్రసంగించినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు కాశ్శీర్ అంశంపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా స్పందించి సమాధానం చెప్పారు. ఐక్యరాజ్య సమితి వైఫల్యాల్ని తన ప్రసంగంలో ప్రస్తావించిన సుష్మా.. తన వాదనకు బలమైన అంశాల్ని ప్రస్తావించారు.

2015లోనూ 1945 నాటి కాలం చెల్లిన విధానాల్ని అనుసరిస్తున్నారంటూ దుమ్ము దులిపేసిన సుష్మ.. భద్రతామండలిలో మార్పు తప్పనిసరి అన్న మాటను నొక్కి చెప్పారు. అంతేకాదు.. రాజకీయ పరిష్కారాల కోసం శాంతి పరిరక్షక దళాలను వినియోగించుకోకూడదని.. ఇలా వాడుకునే సమయంలో దళాల్ని సమకూర్చే భాగస్వామ్య దేశాలతో చర్చలు జరపాలన్న సూచన చేయటం గమనార్హం.

సిరియా.. లిబియాలలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపైనా.. శరణార్థుల విషయంలో అంతర్జాతీయ సమాజం సరైన రీతిలో స్పందించలేదని తేల్చిన సుష్మ.. పాక్ ప్రధాని ప్రతిపాదించిన నాలుగు సూత్రాలపైనా తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు.

శాంతిస్థాపనకు నాలుగు సూత్రాలు అవసరం లేదని.. పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి చర్చలకు వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తేల్చారు. చర్చలు.. ఉగ్రవాదం ఏకకాలంలో సాగటం అసాధ్యమన్న సుష్మా.. అనేక దేశాల వారిని పొట్టనబెట్టుకున్న ముంబై ఉగ్రవాదుల దాడి సూత్రధారి పాక్ లో స్వేచ్ఛగా సంచరించటాన్ని ఒక ఉదాహరణగా ప్రస్తావించారు. అంతర్జాతీయ వేదిక మీద భారత్ వాణి మారిందని చెప్పటానికి తాజాగా సుష్మ చేసిన ప్రసంగమే నిదర్శనంగా చెప్పొచ్చు.