Begin typing your search above and press return to search.

సైకో వీరంగం..వణికిన న్యూయార్క్

By:  Tupaki Desk   |   31 Dec 2019 4:18 AM GMT
సైకో వీరంగం..వణికిన న్యూయార్క్
X
అమెరికాలోని ప్రముఖ నగరమైన న్యూయార్క్ భయంతో వణికిపోతున్న పరిస్థితి. ఒక సైకో వీరంగంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఒక ఇంట్లోకి దూరి.. విచక్షణ రహితంగా జరిపిన కత్తిపోట్లతో ఐదుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది. యూదుల పండుగ దినమైన హనుక్కా వేడుకల వేళ ఈ షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. భయానికి గురి చేసిన ఈ ఘటనలోకి వెళితే..

న్యూయార్క్ లోని ఒక ఇంట్లోకి ప్రవేశించిన సైకో.. ఇంట్లో వారి మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. కనిపించినోడిని కనిపించినట్లుగా కత్తితో విచక్షణ రహితంగా పొడిచేశాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే ఈ దుర్మార్గం చోటు చేసుకుంది. అపరిచిత వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించటమే కాదు.. అతడి ఉన్మాదానికి ఒక్కొక్కరుగా ఒరిగిపోతున్న దుస్థితి.

దాడి ఘటనలో మత ప్రభోధకుడి కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంగం చేసిన సైకో.. కత్తితో దాడి అనంతరం తన దారిన తాను పోయాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న న్యూయార్క్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీన్ని పిరికిపంద చర్యగా న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అభివర్ణించారు.

ఇలాంటి ఘటనల్ని తాము ఉపేక్షించమన్న ఆయన.. జరిగిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సైకో వీరంగం ఘటనపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు రియువెన్ రివ్లిన్ తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. ఇలాంటి మత వ్యతిరేక దాడుల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఇజ్రాయెల్ ప్రజలు దీన్ని అంగీకరించరన్నారు. కొత్త సంవత్సరం వేడుకులకు రెండురోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతంతో న్యూయార్క్ వాసులు ఉలిక్కిపడుతున్నారు. ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడు? అన్న ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.