Begin typing your search above and press return to search.

పావురం ప్ర‌త్య‌క్షం.. స‌రిహ‌ద్దులో క‌ల‌వ‌రం..

By:  Tupaki Desk   |   26 May 2020 8:50 AM GMT
పావురం ప్ర‌త్య‌క్షం.. స‌రిహ‌ద్దులో క‌ల‌వ‌రం..
X
ఒక‌ప్పుడు పావురం రాయ‌బారాల‌కు వినియోగించుకునేవారు. ఇప్పుడు కూడా ఆ విధంగా కొన్నిచోట్ల చేస్తున్నారు. అలాంటిదే చేశార‌ని ఇప్పుడు జ‌మ్మూ ప్ర‌జ‌లు భ‌యాందోళ చెందుతున్నారు. తాజాగా జ‌మ్మూక‌శ్మీర్‌ లోని క‌ఠువా జిల్లాలో ఓ పావురం ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ పావురం సాధార‌ణంగా లేక‌పోవ‌డ‌మే వారిని ఆందోళ‌న‌లో ప‌డేసింది. ఆ పావురం కాలికి ఒక రింగ్ ఉండ‌గా - దాని శ‌రీరంపై ఏవో నంబ‌ర్లు ఉన్నాయి. దీంతో ఎవ‌రైనా స‌మాచారం ర‌హాస్యంగా ఈ విధంగా పంపించుకుంటున్నారేమోన‌ని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

పాకిస్తాన్ - భారత మధ్య అంతర్జాతీయ సరిహద్దులోని కటువా జిల్లా మన్యారీ గ్రామంలో స్థానికులు సోమవారం ఆ పావురాన్ని గుర్తించి పట్టుకున్నారు. దానిని వెంట‌నే అధికారులకు అప్పగించారు. స‌రిహ‌ద్దులోని ఆ కంచె సమీపంలో పట్టుకున్న ఈ పావురం కాలికి ఒక రింగ్ ఉందని - దాని మీద కొన్ని నంబర్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు.

ఆ పావురం పాకిస్తాన్ గూఢచర్యం కోసం శిక్షణనిచ్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆ పావురం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. పావురం కాలికి ఉన్న‌ రింగ్ - దాని మీద ఉన్న కొన్ని నంబర్లు ఏంటో తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌ఠావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర మిశ్రా తెలిపారు. ఈ కేసులను (చొరబాట్లకు సంబంధించిన కేసులను) చూసుకునే ఆపరేషన్స్ గ్రూప్‌ కు ఈ విషయం తెలిపిన‌ట్లు చెప్పారు. వారు కూడా ఈ అంశంపై పరిశీలిస్తున్నారని - కేసు ద‌ర్యాప్తు చేస్తున్నట్లు వివ‌రించారు.

ఈ ప‌రిణామంతో సరిహద్దు ప్రాంతంలోని ప్ర‌జ‌లు భ‌యాందోళన చెందుతున్నారు. దీనికి తోడు స‌రిహ‌ద్దులో పాకిస్తాన్ కంచె ఎందుకు వేయడం లేదని ప్ర‌శ్నిస్తున్నారు. నియంత్రణ రేఖ దగ్గర భారత్- పాక్ కాల్పుల విర‌మ‌ణ‌, భౌతిక దూరం పాటించాల‌ని స్థానికులు కోరుతున్నారు.