Begin typing your search above and press return to search.

టెకీ సూసైడ్‌...మీటూ ఆరోప‌ణే కార‌ణం

By:  Tupaki Desk   |   20 Dec 2018 4:48 PM GMT
టెకీ సూసైడ్‌...మీటూ ఆరోప‌ణే కార‌ణం
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన మీటూ ఉదంతంలో ఊహించిన ప‌రిణామం చోటుచేసుకుంది. జెన్‌ ప్యాక్ట్ ఉద్యోగి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌ గా ప‌నిచేస్తున్న 35 ఏళ్ల స్వ‌రూప్ రాజ్‌ ఢిల్లీలోని త‌న నివాసంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్వ‌రూప్ త‌మ‌ను లైంగికంగా వేధించాడ‌ని కొంద‌రు ఉద్యోగులు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేశారు. లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అత‌ను.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌ లో ఉన్నాడు. స్వ‌రూప్ ఇంట్లో ఉరివేసుకున్న‌ట్లు అత‌ని భార్య ఫోన్ ద్వారా తెలిపిన‌ట్లు పోలీసులు చెప్పారు.

2007 నుంచి స్వరూప్ జెన్‌ ప్యాక్ట్‌ లో ప‌నిచేస్తున్నాడు. ప్రాసెస్ డెవ‌ల‌ప‌ర్‌ గా ఉద్యోగం మొద‌లుపెట్టిన అత‌ను 2015లో సీనియ‌ర్ మేనేజ‌ర్‌ గా మారాడు. ఆ త‌ర్వాత అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌ గా ప్ర‌మోష‌న్ పొందాడు. అయితే, ఇటీవ‌ల ఇద్ద‌రు మ‌హిళా ఉద్యోగులు స్వ‌రూప్‌ పై లైంగిక ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో విచార‌ణ పూర్తి అయ్యే వ‌ర‌కు.. ఐడెంటిటీ కార్డు - ల్యాప్‌ టాప్ ఇవ్వాల్సింది కంపెనీ అత‌న్ని కోరింది. స్వ‌రూప్ ఇంట్లో పోలీసులు సూసైడ్ నోట్‌ ను గుర్తించారు. భార్య‌కు ఆ లేఖ రాశాడ‌త‌ను. ``నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మా కంపెనీలో ఇద్దరు మహిళలు నాపై నిందలు మోపారు. అయితే ఏదో ఒకరోజు అవి నిందలు మాత్రమే అనే విషయం నీతో పాటు ప్రపంచానికి కూడా తెలుస్తుంది. అయినా నాకు నీతో - మన రెండు కుటుంబాలతో తప్ప ఎవరేమనుకున్నా సంబంధం లేదు. ఒకవేళ నేను నిర్దోషినని తెలిసినా సరే ఎంతో కొంత అనుమానం మీలో గూడు కట్టుకుని ఉంటుందని తెలుసు. అది నేను భరించలేను. అందుకే వెళ్లిపోతున్నా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో నీ భర్త ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఈ ప్రపంచం నన్ను ఎప్పుడూ అలాగే చూస్తుంది’ అని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. స్వ‌రూప్ మృత‌దేహాన్ని పోస్టుమార్ట‌మ్‌ కు పంపారు.